దేశానికి సేవ చేయండి | Sakshi
Sakshi News home page

దేశానికి సేవ చేయండి

Published Sun, Dec 18 2016 2:01 AM

దేశానికి సేవ చేయండి - Sakshi

- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌
- ఘనంగా దామోదరం సంజీవయ్య లా వర్సిటీ స్నాతకోత్సవం


సాక్షి, విశాఖపట్నం: న్యాయవాద వృత్తిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో దేశానికి సేవ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ సంస్థలు చూపించే రాయితీలు, ఆఫర్లకు ఆకర్షితులు కావద్దని పేర్కొన్నారు. ఈ వృత్తిలోకి వచ్చేవారికి ఉజ్వల భవిష్యత్‌ ఉందని, ఆర్థికపరమైన ప్రయోజనాలకు తలొగ్గి కార్పొరేట్‌ సంస్థల వైపు మొగ్గు చూపితే ఉన్నత స్థాయిని కోల్పోతారన్నారు.  దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం 2, 3 స్నాతకోత్సవాలు శనివారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్‌ ఠాకూర్‌ కీలకోపన్యాసం చేశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

నేడు పరిస్థితులు మారాయి..
దేశంలో న్యాయవిద్య ఆది నుంచి నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. నేను లా విద్యనభ్యసించిన రోజుల్లో కనీసం తరగతి గదులు కూడా లేవు. నేడు పరిస్థితులు మారాయి. సౌకర్యాలు పెరిగాయి. అవకాశాలు మెండుగా ఉన్నాయి.  లా చదివే ప్రతి ఒక్కరూ ప్లేస్‌మెంట్స్‌ కోసం ఎదురు చూడడం, కార్పొరేట్‌ సంస్థలిచ్చే ఆఫర్స్‌ కోసం ఆసక్తి చూపడం సరికాదు. ప్రతిభావంతులకు రూ.లక్షల జీతాలతో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఒకసారి కార్పొరేట్‌ సంస్థల్లో అడుగుపెడితే నాలుగు గోడలకే పరిమితమైపోతారు. అదే ఎవరైనా సీనియర్‌ వద్ద పదేళ్లు శిక్షణ పొందితే సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చు. నైపుణ్యత సంపాదిస్తే న్యాయమూర్తులుగా ఎదిగి చీఫ్‌ జస్టిస్‌ పీఠాన్ని అధిరోహించవచ్చు.

అక్కడ సౌకర్యాలుండటం లేదు
దేశంలో ఏటా 60 వేల మంది లా పట్టాదారులు బయటికొస్తుంటే.. వారిలో కేవలం 2 వేల మంది మాత్రమే వర్సిటీల నుంచి వస్తున్నారు. మిగిలిన 58 వేల మంది ప్రైవేటు లా కళాశాలల నుంచి వస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయి న్యాయ విద్యను పొందే సౌకర్యాలుండడం లేదు. లా కళాశాలలు, యూనివర్సిటీలు కూడా పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందాలి.

హైకోర్టు ఏర్పాటు చేయాలి: సీఎం
స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ త్వరితగతిన హైకోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చీఫ్‌ జస్టిస్‌ను కోరారు.  అనంతరం 2011–15, 2012–16 సంవత్సరాల మధ్య డిగ్రీ పూర్తి చేసిన వారికి పట్టాలతోపాటు ఈ రెండు బ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రతిభను కనపర్చిన వారికి సుప్రీంకోర్టు సీజే ఠాకూర్, యూనివర్సిటీ చాన్స్‌లర్, హైకోర్టు సీజే రమేష్‌ రంగనాథన్, సీఎం తదితరులు పురస్కారాలు ప్రదానం చేశారు. ఏపీ శాసనమండలి చైర్మన్‌ చక్రపాణికి జస్టిస్‌ ఠాకూర్‌ చేతుల మీదుగా డాక్టర్‌ ఆఫ్‌ లా ప్రదానం చేశారు.

Advertisement
Advertisement