రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటామని రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్యశ్రీ, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి కోండ్రు మురళీమోహనరావు అన్నారు.
విభజన బిల్లును అడ్డుకుంటాం
Dec 22 2013 3:47 AM | Updated on Sep 2 2017 1:50 AM
పాలకొండ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటామని రాష్ట్ర వైద్య విద్య, ఆరోగ్యశ్రీ, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి కోండ్రు మురళీమోహనరావు అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. పాలకొండలో ఏపీ గ్రామీణ వికాస బ్యాంకు రాష్ట్ర డెరైక్టర్ డాక్టర్ సి.ఎల్.నాయుడు నివాస గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీ టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ విభజనకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని, రెండోసారి అఖిలపక్షంలో కూడా పార్టీలు ఇదే పంథా అవలంభించాయన్నారు. తమ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సహా సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు.
సీమాంధ్రలో పొలిటికల్ జేఏసీ...
రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు సీమాంధ్రలో అన్ని రాజకీయ పక్షాలు, ఉద్యోగ సంఘాలతో కలిసి పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కోండ్రు మురళి తెలిపారు. తెలంగాణాలో రాజకీయ పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చిన కారణంగానే కేంద్రంపై ఒత్తిడి పెరిగిందన్నారు. అదే తరహాలో సమైక్యాంధ్ర ఆవశ్యకతను కేంద్రానికి తెలియజెప్పేందుకు పొలిటికల్ జేఏసీ సీమాంధ్రలో అవసరమన్నారు. అన్ని పార్టీలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కొత్తగా పార్టీని స్థాపిస్తారన్న వార్తల్లో వాస్తవంలేదన్నారు.
పాలకొండలో కేంద్రాస్పత్రి ఏర్పాటుకు చర్యలు...
పాలకొండలో జిల్లా కేంద్రాస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కోండ్రు తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌తో చర్చించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మందికి ఇటీవల తెలుపుకార్డులు మంజూరు చేశామని చెప్పారు. వీరంతా ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందవచ్చన్నారు. అలాగే 85 లక్షల మందికి సామాజిక పింఛన్లు మంజూరు చేశామని, 24 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, డీసీసీబీ వైస్ చైర్మన్ దూబ ధర్మారావు, వంగర మాజీ ఎంపీపీ బొత్స వాసుదేవరావునాయుడు, పాలకొండ ఏఎంసీ మాజీ చైర్మన్ పొదిలాపు కృష్ణమూర్తి, మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సి.ఎల్.రమాదేవి తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement