30 వేల టన్నుల బియ్యం పంపిణీ.. 

Distribution of 30 thousand tons of rice to above 24 lakh families - Sakshi

24.38 లక్షల కుటుంబాలకు లబ్ధి

నాలుగో విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభం

పోర్టబిలిటీ ద్వారా సరుకులు తీసుకున్న 6 లక్షల మంది వలసదారులు  

సాక్షి, అమరావతి: పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత సరుకుల పంపిణీ శనివారం ప్రారంభమైంది. తొలి రోజు 24.38 లక్షల కుటుంబాలకు రేషన్‌ అందింది. ఇందులో వలస వెళ్లిన, అవసరాల నిమిత్తం వెళ్లి ఇతర ప్రాంతాల్లో నిలిచిపోయిన 6 లక్షల మంది లబ్ధిదారులు పోర్టబిలిటీ ద్వారా సరుకులు తీసుకున్నారు. శనివారం ఒక్కరోజే 30,996.533 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 1,664.344 మెట్రిక్‌ టన్నుల శనగలు పంపిణీ చేశారు. 

ఉపాధి లేని వేళ.. 
లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.  
► లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటికే 3 విడతలుగా సరుకులు ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. నాలుగో విడత పంపిణీ శనివారం నుంచి ప్రారంభమైంది. 
► రాష్ట్రంలో 1.48 కోట్ల కుటుంబాలకు రేషన్‌ కార్డులున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఒక్కో రేషన్‌ షాపులో రోజుకు 30 మందికే టోకెన్లు జారీ చేశారు. 
► టైం స్లాట్‌తో కూడిన కూపన్లు ముందుగా ఇవ్వడం వల్ల పంపిణీ సాఫీగా సాగుతోంది. కార్డుదారుల వేలి ముద్రలు నమోదు చేస్తున్నందున లబ్ధిదారులు చేతులు శుభ్రం చేసుకునేందుకు వీలుగా ప్రతిచోట శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top