డిస్కౌంట్‌ల ఆషాఢం

Discounts In Ashadham - Sakshi

శ్రావణమాసం కోసం ముందుగానే కొనుగోళ్లు

ఆఫర్లతో అతివలను ఆకర్షిస్తున్న వ్యాపారులు

సందడిగా మార్కెట్లు

విజయనగరం టౌన్‌ : ఆషాఢమాసం పూర్తి కావస్తోంది. శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలు దుస్తుల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని వస్త్ర దుకాణాల వారు స్పెషల్‌ డిస్కౌంట్‌ల పేరుతో పలు రకాల వస్త్రాలను మహిళలకు అందుబాటులోకి తెస్తున్నారు. అతివలు ఎక్కువ మక్కువ చూపే చీరలు, బంగారు ఆభరణాలపై వ్యాపారులు పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఆషాఢం సేల్‌ పేరుతో మహిళలను దుకాణదారులు ఆకర్షిస్తున్నారు.

పట్టుచీరలకు డిస్కౌంటే..

వ్యాపారులు ప్రధానంగా ధర్మవరం, బెనారస్, ఉప్పాడ, కంచి, పోచంపల్లి తదితర పట్టుచీరలకు, వీటితో పాటు టిష్యూ శారీస్, కళంకారీ ప్రింట్స్, కాటన్‌ శారీస్, గద్వాల్, లెనిన్‌ కాటన్, చేనేత వస్త్రాలు, వెంకటగిరి తదితర చీరలకు గిరాకీని దృష్టిలో ఉంచుకుని డిస్కౌంట్లను పెడుతున్నారు. రూ.500 నుంచి రూ.50 వేల వరకు పట్టు, ఫ్యాన్సీ, కాటన్‌ చీరలు అందుబాటులోఉన్నాయి. ఇక బంగారం విషయానికి వస్తే ఆషాఢంలో దాని ధర తక్కువగా ఉంటుంది.

రాబోయే శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్మీ దేవీకి స్వాగతం పలికేందుకు కాసుల దగ్గర నుంచి ఆభరణాల వరకు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. దాని కోసం ముందుగానే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. పట్టణాల్లోని మాల్స్, బంగారు దుకాణాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. చిన్నపాటి చిరుజల్లులను కూడా లెక్క చేయకుండా మహిళలు కొనుగోళ్లు చేస్తుండడం విశేషం.

నవ వధువులకు వరం..

ఆషాఢ మాసంలో కన్నవారింటికి నవ వధువులు వెళ్తారు. మళ్లీ అత్తింటి వారింటికి వెళ్లే సమయంలో బంగారం, వస్త్రాలను కన్నవారు పెట్టడం ఆనవాయితీ. దానికోసం ఆషాడంలోనే ముందుగా బంగారం, వస్త్రాలను కొనుగోలు చేసుకుంటున్నారు. ఆషాఢం నుంచి శ్రావణంలోకి అడుగు పెట్టేందుకు నవ వధువులు వేచి చూస్తుంటారు.

ధరలు తక్కువ..

ఆషాఢంలో ధరలు తక్కువగా ఉంటాయి. దుస్తులు కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఉత్సాహం చూపుతారు. శ్రావణ మాసం ముందు ఉండడంతో డిస్కౌంట్లు ఉండడంతో మహిళలు ఎక్కువ మక్కువ చూపుతారు. బంగారం కూడా ఈ మాసంలోనే కొనుగోలు చేస్తారు.           – భోగరాజు సూర్యలక్ష్మి, ఉద్యోగిని.

ఆషాడం ఓ వరం..

మహిళలకు ఆషాఢ మాసం ఓ వరమని చెప్పొచ్చు. ఏడాదిలో ఈ నెలలోనే తక్కువ ధరలకు దుస్తులు, బంగారం కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మాసం చివరి రోజుల్లో ధరలు మరీ తగ్గించి అమ్మకాలు జరుగుతుంటాయి. అందుకోసం ప్రత్యేక బోర్డులు కూడా మార్కెట్లో వెలుస్తాయి. ఉన్నంతలో వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.

– జయలక్ష్మి, గృహిణి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top