గుంటూరులో విస్తరించిన డయేరియా

Diarrhea Cases hikes In GGH Hospital - Sakshi

గుంటూరు నగర వాసులను వణికిస్తున్న డయేరియా ఆరోరోజూ అదుపులోకి రాలేదు. ఆస్పత్రులకు రోగుల రాక కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలో సైతం డయేరియా కేసులు నమోదవటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో అదనంగా మరో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.

గుంటూరుమెడికల్‌: రాజధాని నగరం గుంటూరులో ఆరోరోజు కూడా డయేరియా పూర్తిగా అదుపులోకి రాలేదు. పైగా నిన్నటివరకు  గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మాత్రమే ఉన్న డయేరియా శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలో సైతం కొన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం గమనార్హం. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చికిత్స కోసం వస్తున్న బాధితుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.  దీంతో నగర ప్రజలు  భయాందోళనలకు గురవుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌కు వస్తున్న రోగుల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడంతో వైద్యులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

పెరిగిన డయేరియా కేసులు...
ఈనెల 3 న గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పాతగుంటూరు, ఆనందపేట, సంగడిగుంట, చిన్నబజారు, చౌత్రాసెంటర్, ఎల్‌బీ నగర్, లాంచెస్టర్‌ రోడ్డు, వడ్డెర కాలనీ, బాలాజీనగర్, ఐపీడీ కాలనీ ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. గత ఆరు రోజులుగా ఈ ప్రాంతాల్లో ప్రజలు వెయ్యికి పైగా డయేరియాతో ఆస్పత్రిలో చికిత్స పొందగా 10 మంది   డయేరియాతో చనిపోయారు. 20 మంది వరకు కిడ్నీ ఫెయిల్యూర్స్‌తో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం డయేరియా మృతి కేసు నమోదవకపోవడంతో డయేరియా తగ్గుముఖం పట్టినట్టు అధికారులు భావించారు. కాని గురువారం రాత్రి నుంచి మళ్లీ డయేరియా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైంది.

తూర్పు నుంచి పశ్చిమకు పాకిన డయేరియా
తూర్పు నియోజకవర్గంలో  వారం రోజులుగా ఉన్న ప్రాంతాలే కాకుండా గురువారం రాత్రి నూతన ప్రాంతాల్లో సైతం డయేరియా కేసులు నమోదు అవడంతో వైద్యులు, ప్రజలు భయాందోళâ¶నలు చెందుతున్నారు. వల్లూరివారితోట, శారదాకాలనీ, నల్లచెరువు, నెహ్రూనగర్, హుస్సేన్‌ నగర్, కొత్తపేట,లాలాపేట, రామిరెడ్డితోట తదితర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి.  పశ్చిమ నియోజకవర్గంలోని గుజ్జనగుళ్ళ, మల్లికార్జునపేట, కేవీపీ కాలనీ, చంద్రబాబునాయుడు కాలనీ, నల్లచెరువు తదితర ప్రాంతాల ప్రజలు డయేరియాతో బాధపడుతూ చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చారు. తాడికొండ, లాం, పెదకాకాని ఇతర గ్రామాల్లో సైతం డయేరియాతో బాధపడుతూ చికిత్స కోసం పలువురు జీజీహెచ్‌కు వచ్చారు.  కేవలం ఒక్క గుంటూరు జీజీహెచ్‌లోనే  గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఓపీ వైద్య విభాగంలో 56 మంది, ఇన్‌పేషేంట్‌ విభాగంలో 36 మంది  అడ్మిట్‌ అయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ విభాగంలో 42 మంది, ఇన్‌పేషేంట్‌ విభాగంలో 32 మంది చికిత్స పొందారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపీ విభాగంలో 30 మంది, ఇన్‌పేషేంట్‌ విభాగంలో 25 మంది చికిత్స పొందారు.

అదనంగా వార్డులు ఏర్పాటు
జీజీహెచ్‌లో డయేరియా కేసులు పెరుగుతూ ఉండడంతో శుక్రవారం అదనంగా ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. జీజీహెచ్‌లో శుక్రవారం 250 మందికి పైగా డయేరియా బాధితులు అడ్మిష¯Œన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.  వీరిలో పిల్లలు 56 మంది ఉండడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

జీజీహెచ్‌లో మంచినీరు తాగాలంటే భయం
ఆస్పత్రిలో వారం రోజులుగా డయేరియా బాధితులు చికిత్స పొందుతూ ఉండడంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది  ఆస్పత్రిలో మంచినీరు తాగాలంటే భయపడిపోతున్నారు.  శుక్రవారం ఆస్పత్రిలో డయేరియా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్న  వైద్య సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు తెప్పించినా డయేరియా భయంతో వాటిని ముట్టుకోకుండా పక్కన పడేశారు. ఇంటి వద్ద నుంచి కాచి తెచ్చుకున్న నీటినే వైద్య సిబ్బంది తాగుతున్నారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు కాచి చల్లార్చిన నీటినే తాగించడం చాలా ఉత్తమమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

వైద్యుల నిరంతర పర్యవేక్షణ...
డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో వైద్యాధికారులు ఆస్పత్రిలో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు, ఆర్‌ఎంఓలు డాక్టర్‌ ఆదినారాయణ, డాక్టర్‌ రమేష్, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పుష్పావతి, పలువురు సీనియర్‌ వైద్యులు డయేరియా బాధితులు ఉన్న వార్డులపై ప్రత్యేక  దృష్టి  సారించారు. జూనియర్‌ వైద్యులు, నర్సింగ్‌ విద్యార్థులు, నర్సింగ్‌ సిబ్బందిని పలు వార్డుల నుంచి డిప్యూటేషన్‌పై డయేరియా వార్డులకు కేటాయించి సత్వరమే వైద్యసేవలను అందేలా చూస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు సైతం అంబులెన్స్‌ల్లో, ఆటోల్లో వచ్చిన డయేరియా బాధితులను సకాలంలో వార్డులకు చేర్చి వారికి మెరుగైన వైద్యసేవలను అందించేందుకు కృషి చేస్తున్నారు. డయేరియా రోగులకు మినరల్‌ వాటర్‌ బాటిళ్లను సైతం ఆస్పత్రి అధికారులు అందజేశారు.

నన్నపనేని పరామర్శ...
రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి శుక్రవారం జీజీహెచ్‌లో డయేరియా బాధితులను పరామర్శించారు. రోగులకు ఆస్పత్రి సిబ్బంది అందిస్తున్న వైద్యసేవలను అభినందించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వాటర్‌ ట్యాంకుల ద్వారా తాగేందుకు, వంట చేసుకునేందుకు ప్రజలకు నీటిని తక్షణమే అందించాలని కోరారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలను పరిశుభ్రం చేసి వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top