
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 33 మంది బాధితులు
ఒకరి పరిస్థితి విషమం
కలుషిత నీరే కారణమని బాధితులు వెల్లడి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తురకపాలెంలో వరుస మరణాలతో బెంబేలెత్తుతున్న గుంటూరు జిల్లా ప్రజలపై ఇప్పుడు డయేరియా పడగ విప్పింది. కలుషిత నీటి సరఫరా వల్ల వాంతులు, విరేచనాలతో ప్రజలు అల్లాడుతున్నారు. మూడు రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో 33 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 53 ఏళ్ల రమణారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. పాత గుంటూరుకు చెందిన ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రెండు రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
శ్రీనగర్, రెడ్లబజారు, మంగళదాస్‌నగర్, రాజగోపాల్‌నగర్, రామిరెడ్డితోట, సంపత్‌నగర్, నల్లచెరువు, భాగ్యనగర్, ఆర్టీసీ కాలనీ, బుచ్చయ్యతోటకు చెందిన వారు కూడా డయేరియా బారినపడ్డారు. అలాగే తాడేపల్లి, తెనాలి, ఓబులనాయుడుపాలెం, రెడ్డిపాలెంకు చెందిన పలువురు సైతం డయేరియాతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
కలుషిత నీటి సరఫరా వల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు వాసన వస్తున్నాయని వాపోయారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. కాగా, డయేరియా బాధితులు పెరుగుతుండడంతో గుంటూరు జీజీహెచ్‌లోని ఇన్‌పేషెంట్ విభాగం జనరల్ సర్జరీ డిపార్టుమెంట్‌లో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు.