విజయం వరించే వరకు విశ్రమించొద్దు

Dharmana Prasad Rao Meeting In Srikakulam - Sakshi

పార్టీలోకి అందరినీ స్వాగతిద్దాం

చంద్రబాబు తాయిలాలను ప్రజలు నమ్మరు

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పార్టీముఖ్యుల సమావేశంలో ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, పార్టీ ముఖ్యులు విశ్రమించకుండా సైనికుల్లా పనిచేస్తే విజయం సొంతమవుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆనందమయి కన్వెన్షన్‌ హాల్‌లో మంగళవారం శిమ్మ రాజశేఖర్‌ అధ్యక్షతన పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే నవరత్నాలు ప్రకటించడంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, చెల్లని చెక్కులు ఇచ్చి మహిళలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత హామీలను నాలుగున్నరేళ్లు విస్మరించి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగులను మళ్లీ మోసం చేసేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. బాబు, లోకేష్‌లు రాజధాని భూములతో రియల్‌ వ్యాపారం చేసుకుని సంపాదించిన డబ్బులతో జనం ఓట్ల కొనేందుకు ఇప్పటికే రూ.5వేలు కోట్లు సిద్ధం చేశారని ఆరోపించారు.
రాష్ట్రం ఇప్పటికే రూ1.25 లక్షల కోట్లు అప్పు చేసిందని, వెనుకబడిన జిల్లాకు అప్పులో భాగంగా రూ.15 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.

అందరి సూచనలతో ముందడుగు వేస్తా..
సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నందున పార్టీ బలోపేతానికి చేయాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ధర్మాన పిలుపునిచ్చారు.  పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి.. ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనే సలహాలు, సూచనలు చెబితే అందుకు అనుగుణంగా ముందుకు సాగుతానన్నారు. పార్టీలో చేరాలనుకునేవారిని హృదయపూర్వకంగా స్వాగతిద్దామని, ఎక్కడా అడ్డు తగలవద్దని కోరారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే అన్నివర్గాల ప్రజలను కలుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో 50 రోజుల పాటు రోజుకి 150 ఇళ్లు చొప్పున నగరంలో ఓ కార్యక్రమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వై.వి.సూర్యనారాయణ, పార్టీ సీఈసీ మెంబర్‌ అంధవరపు సూరిబాబు సమక్షంలో కమిటీలు వేస్తున్నామని చెప్పారు. అనంతరం ఆర్ట్‌ఆఫ్‌లివింగ్‌ సభ్యుడు డాక్టర్‌ కింజరాపు అమ్మన్నాయుడు యోగాతో కలిగే లాభాలను పార్టీ శ్రేణులకు వివరించారు. సమావేశంలో అంధవరపు వరం, ఎం.వి పద్మావతి, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ల తాతబాబు, పీస శ్రీహరి, పొన్నాడ రుషి, గొండు కృష్ణమూర్తి (పీఏసీఎస్‌), కోణార్క్‌ శ్రీను, కె.ఎల్‌ ప్రసాద్, శ్రీనివాస పట్నాయక్, డాక్టర్‌ పైడి మహేశ్వరరావు, చిట్టి రవికుమార్, గొండు కృష్ణమూర్తి (డీసీఎంఎస్‌), సాధు వైకుంఠరావు, చల్లా అలివేలు మంగ, టి.కామేశ్వరి, పి.సుగుణారెడ్డిలతో పాటు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top