అనాథ శవాల రేటు పెంచేద్దాం..!

Devolopment Committee Hikes Orphan Dead Bodied Price - Sakshi

వైద్య విద్యార్థుల ఫీజులూ రెట్టింపు చేద్దాం

హాస్పటల్స్‌ ఇన్‌స్పెక్షన్‌ రేటు కూడా పెంచుదాం

ఆదాయం పెంచడమే లక్ష్యంగా అభివృద్ధి కమిటీ సమావేశం

లబ్బీపేట (విజయవాడ తూర్పు) : నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, చివరికి అనాథ శవాల రేటు పెంచి ఆ వచ్చిన సొమ్ముతో రోగులకు వైద్యం చేయాలని చూడటం విస్మయానికి గురి చేస్తోంది. అంతేకాదు ప్రభుత్వాస్పత్రిలో శిక్షణ కోసం వచ్చే విద్యార్థుల ఫీజులను సైతం రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై పలువురు సీనియర్‌ ప్రొఫెసర్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి పనులు చేయాలే కాని, ఇక్కడే ఆదాయ వనరులను వెతకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

శవాల రేటు పెంచేద్దాం..
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అనాథ శవాలను ప్రవేటు వైద్య కళాశాలల వారు వైద్య విద్యార్థుల పరీక్షల కోసం తీసుకెళ్తుంటారు. అందుకు గాను ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి నిధులకు రూ.15 వేలు చెల్లిస్తుంటారు. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం, ఖర్చులకు సైతం డబ్బులు లేకపోవడంతో ఇకపై ఒక్కో అనా«థ శవాన్ని రూ.25 వేలకు అమ్మాలని గురువారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

శవాలను అమ్మి ఆ వచ్చిన సొమ్ముతో పేదలకు వైద్యం చేయాల్సిన దుస్థితి తలెత్తడంపై మండిపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నిధులు పెంచేందుకు, ఆస్పత్రిలోనే ఆదాయ వనరులు చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

పిల్లల ఫీజులూ పెంచుదాం..
ప్రయివేట్‌ ఇనిస్టిట్యూషన్స్‌లో శిక్షణ పొందుతున్న నర్శింగ్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపీ విద్యార్థులు శిక్షణ కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు. అలా వచ్చిన వారు ఒక్కొక్కరూ రూ.వెయ్యి చెల్లిస్తుంటారు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.2 వేలు చేయాలని కమిటీ నిర్ణయించింది. అంతేకాదు ప్రయివేట్‌ ఆస్పత్రులకు çప్రభుత్వ గుర్తింపు కోసం గవర్నమెంట్‌ డాక్టర్లు ఇన్‌స్పెక్షన్‌ చేయాల్సి ఉంది. అందుకు గాను హెచ్‌డీఎస్‌కు రూ.30 వేలు చెల్లిస్తారు. ప్రభుత్వాస్పత్రి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా దాన్ని రూ.50 వేలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించడం విశేషం. అంతేకాదు షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టి, షాపులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవడంతోపాటు, ప్రయివేట్‌ మెడికల్‌ షాపుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే విధంగా హెచ్‌డీఎస్‌లో చర్చించడం గమనార్హం.

ఆస్పత్రి పయనమెటో..
పేదలకు వైద్యం చేసే ప్రభుత్వాస్పత్రిని సైతం వ్యాపారమయంగా చేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. అనాథ శవాల రేట్లు పెంచేయడం, ప్రయివేట్‌ వ్యక్తులతో మందుల వ్యాపారం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం వంటి నిర్ణయాలు సరి కాదని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వమే హెచ్‌డీఎస్‌కు నిధులు సమకూర్చాలని పలువురు వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈఈపై ఆగ్రహం..
వైద్య, ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ప్రవీణ్‌రాజ్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీవు సరైన సమయంలో పనులు పూర్తి చేయడం లేదు..’ అని కలెక్టర్‌ అంటే, అనుకున్న సమయానికి పూర్తి చేస్తున్నామని ఈఈ బదులిచ్చారు. దీంతో చిర్రెత్తిన కలెక్టర్‌ నువ్వు ఇక్కడ పనికి రావని పేర్కొనడంతో, తాను కూడా బదిలీకి ప్రయత్నిస్తున్నానని ఈఈ సమాధానం చెప్పడం విశేషం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top