
బోటు వెలికిత ప్రయత్నంలో సత్యం బృందం
దేవీపట్నం (రంపచోడవరం): గోదావరిలో కచ్చులూరు మందం వద్ద మునిగిపోయిన బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం రెండో రోజు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. బోటు మునిగిన ప్రాంతంలో సోమవారం వలయాకారంలో నదిలోకి వదిలిన ఐరన్ రోప్‌ను మంగళవారం పొక్లెయిన్ సాయంతో ఒడ్డుకు లాగుతుండగా రాతి బండలకు చుట్టుకుని తెగిపోయింది. దీంతో వ్యూహం మార్చారు. ఏపీ టూరిజం బోటుకు పంటును జత చేసి.. 800 మీటర్ల పొడవైన ఐరన్ రోప్‌కు చివరన లంగరు కట్టారు. దానిని మునిగిన బోటు ఉన్నట్టుగా భావిస్తున్న ప్రాంతంలో వదులుకుంటూ వచ్చారు.
తరువాత ఆ రోప్‌ను లాగగా.. లంగరు మాత్రమే బయటకొచ్చింది. దీంతో రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. మునిగిన బోటును పైకి తెచ్చేవరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని వెలికితీత బృందానికి నాయకత్వం వహిస్తున్న ధర్మాడి సత్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. తొలి వ్యూహంలో భాగంగా గోదావరిలో 2 వేల మీటర్లు ఐరన్ రోప్‌ను వలయంగా వేశామని తెలిపారు. అది నదిలోని రాతిబండలకు చుట్టుకోవడంతో తెగిపోయిందన్నారు. సుమారు వెయ్యి మీటర్లు రోప్ గోదావరిలో ఉండిపోయిందన్నారు. దాని విలువ రూ.2 లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.