Sakshi News home page

కలిసుంటేనే అభివృద్ధి

Published Tue, Nov 5 2013 1:52 AM

కలిసుంటేనే అభివృద్ధి - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అంగారకుడు, చంద్రమండలంపైకి ఉపగ్రహాలు పంపిస్తున్నాం. ఇతర గ్రహాల కక్ష్యల్లోకి పంపేందుకు రాకెట్లు నిర్మిస్తున్నాం.. కానీ భూమిపైన మాత్రం గీతలు గీస్తున్నాం. ఇది సమంజసం కాదు’ అంటూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట విభజనను పరోక్షంగా ప్రస్తావిస్తూ పలువ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్‌పల్లి సమీపంలో వైట్‌గోల్డ్ ఇంటిగ్రేటెడ్ సింటెక్స్ పార్క్‌కు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదిభట్ల గ్రామంలో ‘సమూహ ఏరోస్పేస్ పార్కు’ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి వ్యతిరేకించారు. ‘ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలకు ఉపగ్రహ విడి భాగాలను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు. అలాంటి శాస్త్రవేత్తలను, విడి భాగాలను అందిస్తూ దేశాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది. కానీ వాళ్లు ఇక్కడి భూమిపై గీతలు గీస్తుండడం బాధ కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ‘కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం. యాజమాన్యం, కార్మికులు కలిసి పనిచేస్తేనే ఆ సంస్థ ముందుకు వెళ్తుంది. రూ.14వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఆల్విన్ కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం చేసిన పొరపాట్లతో కుప్పకూలింది. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు’ అని సీఎం కిరణ్ పేర్కొన్నారు.
 
 చేనేత రంగానికి మంచిరోజులు
 నేత రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయని సీఎం చెప్పారు. ‘రాష్ట్రంలో ఏటా సగటున 14లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతోంది. కానీ ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో పత్తిని నేరుగా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. దీంతో రైతుకూ న్యాయం జరగట్లేదు. ఆదాయమూ పెరగట్లేదు. అందువల్ల రాష్ట్రంలో మొట్టమొదటగా ఇక్కడ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది అందుబాటులోకి వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి’ అని వివరించారు.
 
 వృత్తి నైపుణ్యమే కీలకం: కేంద్ర మంత్రి కావూరి
 ఇటీవలి వర్షాలతో తడిసిన పత్తిని కొనుగోలు చేసేందుకు త్వరలో నల్లగొండ, మహబూబ్‌నగర్, గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు వెల్లడించారు. ఉద్యోగాలు సాధించాలంటే చదువుతో పాటు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ప్రభుత్వం రూ.1900కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బిక్షపతియాదవ్, కె.లక్ష్మారెడ్డి, గాదె వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రికి తెలంగాణ సెగ తగల కుండా పోలీసులు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement