ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం | Development of SC, ST, backward classes State Govt's top priority | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం

Oct 19 2013 7:27 AM | Updated on Sep 15 2018 3:18 PM

జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు.

 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా జనాభాలో 50 శాతానికంటే ఎక్కువగా ఉన్న ఎస్సీ, ఎస్టీల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు, వారు అన్ని రంగాల్లో పోటీ పడేందుకు అనువైన వాతావరణానికి అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని కోరారు. వైవిధ్యమైన పరిస్థితులున్న ఈ జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 2009 నుంచి 2012 వరకు నమోదైన కేసుల్లో 152 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందిందని చెప్పారు. 96 కేసులు పోలీసుల విచారణలో ఉన్నాయని చెప్పారు. వీటిలో 19 కేసులు కొత్తగూడెం డివిజన్‌లో ఉన్నాయన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు చెప్పారు. కులాంతర వివాహం చేసుకున్న 106 జంటలకు ప్రోత్సాహక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.  ఆయా గ్రామాల్లో పెద్దల భాగస్వామ్యంతో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ డివిజన్‌స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
 
 ఎస్పీ ఎవి.రంగనాధ్ మాట్లాడుతూ.. హైకోర్టులో, ఇతర కోర్టుల్లోగల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతంగా సాగేలా సహకరించేందుకు, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూసేందుకు హైదరాబాద్‌లో పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమించినట్టు తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సంఖ్య తగ్గుతోందన్నారు. 2011లో 187, 2012లో 133 నమోదయ్యాయని చెప్పారు. 2013లో ఈ కేసుల సంఖ్య 100 కు మించకపోవచ్చని అన్నారు.
 
 కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చట్టపరంగా సంక్రమించిన హక్కుల పరిరక్షణకు అండగా నిలవాలని పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచించారు. గిరిజనులపై కేసులను వెంటనే పరిష్కరించాలని కోరారు.
 
 ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ బాబూరావు, ట్రైనీ కలెక్టర్ మల్లికార్జున్, సోషల్ వెల్ఫేర్ డీడీ వెంకటనర్సయ్య, ఆర్డీవోలు సంజీవరెడ్డి, అమయ్‌కుమార్, శ్యామ్‌ప్రసాద్, డీఎస్పీలు తిరుపతి, అశోక్‌కుమార్, రవీందర్‌రావు, బాలకిషన్‌రావు, కృష్ణ, సాయిశ్రీ, ఎస్సీ-ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు గురుమూర్తి, రవికుమార్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement