తూర్పులో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభం

Deputy CM Subhas Chandra Bose Launched YSR Kanti Velugu Scheme In East Godavari District - Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని గురువారం డిప్యూటీ సీఎం సుభాష్‌ చంద్రబోస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వం అటు విద్య..ఇటు ఆర్యోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. జిల్లాలో ఏడు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రేపటి తరం కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌ ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, కళ్ల అద్దాలు ఇస్తుందని...అవసరమైతే కంటి ఆపరేషన్‌ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ, పంచాయితీ, స్కూల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

కృష్ణా జిల్లా: పెనమలూరు నియోజకవర్గం కానూరు జడ్పీ హైస్కూల్‌లో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ కంటి పథకాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు తాతినేని పద్మావతి,ఎంపీటీసీ ఛాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా: నర్సాపురంలోని లెనిన్‌ హైస్కూల్లో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో సుమారు లక్షా 60 వేల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థి, విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

కర్నూలు జిల్లా: కల్లూరు మండలం జెడ్పీ హైస్కూలులో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్‌ తరాల కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో కంటి వెలుగు పథకాన్ని సీఎం ప్రారంభించడం అభినందనీయమని కాటసాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా  విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు.

‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకానికి రూ.5లక్షల విరాళం..
అనంతపురం జిల్లా:  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్‌ కంటి వెలుగు పథకానికి జంగాలపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున రెడ్డి రూ.5 లక్షలను విరాళంగా ఇచ్చారు. గురువారం అనంతపురంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top