పలమనేరు పరువు హత్యపై స్పందించిన డిప్యూటీ సీఎం

Deputy CM Narayana Swamy Condemn Palamaneru Honour Killing - Sakshi

సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగిన పరువు హత్య ఘటన బాధాకరమని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమకు కుల,మతం లేదని, ప్రేమ పవిత్రమైనది ఆయన పేర్కొన్నారు. కులాంతర వివాహం చేసుకుంటే చంపడం చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. హేమావతిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. 

పలమనేరులో పరువు హత్య..
కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. ఆమెను తండ్రి కిరాతకంగా చంపేసిన ఘటన ఈ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఉసిరిపెంట గ్రామంలో జరిగిన సంగతి తెలిసిందే. ఉసరిపెంటకు  చెందిన భాస్కర్‌ నాయుడు కూతురు హేమవతి అదేగ్రామానికి చెందిన దళితుడైన కేశవులును రెండేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు చంపేస్తామని బెదిరించడంతో ఆ దంపతులు బంధువులకు దూరంగా ఉంటూ కాపురం చేస్తున్నారు. వారంరోజుల క్రితం హేమవతి పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వారు తిరిగి గ్రామంలోకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్‌ నాయుడు కుటుంబం భరించలేకపోయింది. పుట్టిన బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెల్లి వస్తుండగా అప్పటికే మాటువేసిన అమ్మాయి తరపు బంధువులు అడ్డుకున్నారు. ఆ పసికందును కేశవులుకు అప్పగించి.. హేమవతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని లాక్కెళ్లిపోయారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాక తండ్రి భాస్కర్‌నాయుడు హేమవతిని చిత్రహింసలకు గురిచేశారు. సొంత కూతురని మరిచి గొంతుకు ఉరిబిగించి హతమార్చి.. పక్కనే ఉన్న బావిలో పడేసి వెళ్లిపోయారు. ఏడు రోజుల పసిపాప తల్లిలేని అనాధగా మిలిగింది.
(చదవండి: చిత్తూరులో పరువు హత్య కలకలం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top