వీడని డెంగీ...

Dengue Deaths In Vizianagaram - Sakshi

డెంగీ జ్వరాలు జిల్లాను ఇంకా వదలడం లేదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలువురు మృత్యువాత పడినా  జ్వరాల నియంత్రణలో వైద్యశాఖా«ధికారులు సఫలీకృతులు కాలేకపోయారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడంతో అంటురోగాలు ప్రబలి వరుస మరణాలు సంభవిçస్తున్నాయి. జిల్లా వైద్యాధికారులు మాత్రం డెంగీ జ్వరాలు లేవని చెబుతున్నా రిపోర్టులు మాత్రం డెంగీ లక్షణాలతోనే మరణాలు సంభవిస్తున్నట్లు చెబుతున్నాయి. తాజాగా  ఎస్‌.కోట మండల కేంద్రంలోని పెద్దవీధికి చెందిన వసంత రామకృష్ణ (28), మెంటాడ మండలం లోతుగెడ్డకు చెందిన అగతాన పైడిరాజు (26) విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.దీంతో ఆయా గ్రామల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

విజయనగరం, శృంగవరపుకోట రూరల్‌: డెంగీ లక్షణాలతో పట్టణంలోని పెద్దవీధికి చెందిన వసంత రామకృష్ణ (28) అనే వ్యక్తి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. శుక్రవారం ఉదయం మృతుని కుటుంబ సభ్యులు స్థానిక విలేకరులకు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. వసంత రామకృష్ణ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సావిత్రి, మూడేళ్ల కుమారుడు యశ్వంత్, నెల వయసు గల భవ్య అనే కుమార్తె ఉన్నారు. కూతురు నామకరణ మహోత్సవానికి గజపతినగరంలోని అత్తవారింటికి వెళ్లిన రామకృష్ణ తన తల్లికి బుధవారం ఫోన్‌ చేసి జ్వరం వచ్చిందని.. గురువారం పాపకు పేరు పెట్టిన అనంతరం ఆస్పత్రికి వెళ్తానని చెప్పాడు. అనుకున్నట్లు గానే కుమార్తెకు భవ్య అనే పేరు పెట్టి గురువారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని మహారాజా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు రామకృష్ణను పరీక్షించి ప్లేట్‌లెట్స్‌ తక్కువగా ఉన్నాయని చెప్పి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. దీంతో రామకృష్ణను కేజీహెచ్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. రామకృష్ణ మృతితో భార్య సావిత్రి, ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. 

జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే..
జ్వర మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని సీపీఎం మండల కార్యదర్శి మద్దిల రమణ ఆరోపించారు. రామకృష్ణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,  పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. అలాగే ఎక్కడబడితే అక్కడ చెత్త,చెదారాలు పేరుకుపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆరోపించారు. ఇవి కచ్ఛితంగా ప్రభుత్వ హత్యలేనన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దోమలపై దండయాత్ర, సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

చికిత్స పొందుతూ మరొకరు
మెంటాడ: మండలంలోని లోతుగెడ్డ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ సర్పంచ్‌ అగతాన త్రినాథరావు, పార్వతమ్మల కుమారుడు అగతాన పైడిరాజు (26) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. పైడిరాజుకు ఆయన తల్లి పార్వతమ్మలకు 15 రోజుల కిందట జ్వరం రావడంతో ముందుగా మెంటాడ ప్రాథమిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్కడకు రెండు రోజుల తర్వాత పైడిరాజుకు కడుపునొప్పి  గత శుక్రవారం గజపతినగరం ఆస్పత్రికి తీసుకువెళ్లారు.అక్కడి వైద్యుల సలహామేరకు విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి పైడిరాజు ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయని.. కామెర్లతో పాటు డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు పైడిరాజును విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.  మృతుడికి తల్లిదండ్రులు, భార్య రాధ, కుమారుడు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top