
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా డెల్టాలో సాగుకు 152.2 టీఎంసీల నీరు అవసరమని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వాదించింది. గోదావరి నుంచి డెల్టాకు 80 టీఎంసీలే మళ్లిస్తున్నామని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఏపీ తరఫు సాక్షి, సాగునీటి రంగ నిపుణుడు కేవీ సుబ్బారావును తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
గోదావరి నీటిని పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా మళ్లించి డెల్టా సాగు అవసరాలు తీర్చితే పులిచింతల నీటి అవసరం ఉండదు కదా అని వైద్యనాథన్ ప్రశ్నించగా.. డెల్టా నీటి అవసరాలు 152.2 టీఎంసీలని, గోదావరి నుంచి 80 టీఎంసీలే మళ్లిస్తున్నట్లు సుబ్బారావు సమాధానమిచ్చారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సాగర్‌కు నీటిని ఎత్తిపోయడం ద్వారా సముద్రంలోకి వెళ్తున్న నీటిని ఆపి సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా వినియోగించు కొనేందుకు సాధ్యమవుతుందా అని ప్రశ్నించగా.. అందు కు 17 నుంచి 590 అడుగులకు నీరు ఎత్తిపోయాల్సి ఉంటుందన్నారు. ఇక గోదావరి, పెన్నార్ నదుల అనుసంధానంపై అధ్యయనం జరుగుతోందన్నారు. కాగా, తదుపరి విచారణ వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో జరగనుంది.