కూతురే కొడుకయ్యింది !

గుంటూరు, తాడేపల్లిరూరల్: కూతుళ్లే కొడుకులయ్యారు.. కన్నవారికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకున్నారు. పున్నామనరకం నుంచి కాపాడే పుత్రుడు ఫోనెత్తకపోవడంతో కనిపెంచిన తల్లిదండ్రులకు కూతుళ్లే కడసారి వీడ్కోలు పలికారు. వివరాల్లోకి వెళ్లితే.. సీతానగరంలో నివాసం ఉండే పేద కుటుంబం పారేపల్లి నారాయణ, సరోజిని దంపతులకు ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకు పదేళ్ల కిందట వివాహం చేసుకొని వేరే ఊరు వెళ్లిపోయాడు. పెద్దకూతురుకు, చిన్నకూతురుకు వివాహమైంది.
రెండవ కూతురు, మూడవ కూతురు తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తల్లి సరోజిని మృతి చెందడంతో మూడవ కూమార్తె పార్వతి అంత్యక్రియలను నిర్వహించింది. 2011లో తండ్రి నారాయణ మరణించినప్పుడు రెండవ కూతురు దేవి తలకొరివి పెట్టగా, ప్రస్తుతం తల్లికి మూడవ కూతురు అంత్యక్రియలు చేసింది. ఉన్న ఒక్క కుమారుడు ఫోన్‌లో స్పందించకపోవడంతో కూతుళ్లే తలకొరివి పెట్టారని, సమాజంలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునేది కూతుళ్లేనని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి