300 గ్రామాల్లో అంధకారం

Darkness in 300 villages in AP With The Effect Of Fani Cyclone - Sakshi

2 వేల స్తంభాలు నేలమట్టం

733 గ్రామాల్లో  విద్యుత్‌కు అంతరాయం

పునరుద్ధరణకు 2,600 మంది సిబ్బంది

సాక్షి, అమరావతి: ఫొని తుపాను ఉత్తరాంధ్రలో విద్యుత్‌ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. మొత్తం 2 వేల విద్యుత్‌ స్తంభాలు నేలకూలగా, దాదాపు 300 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కంతిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, పలాస, కవిటి, నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, గార, పొలాకీ మండలాల్లో విద్యుత్‌ నష్టాలు భారీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 32 కేవీకి చెందిన 19 ఫీడర్లలోని 733 గ్రామాల్లో విద్యుత్‌ వ్యవస్థకు అంతరాయం కలిగినట్టు, అయితే శుక్రవారం సాయంత్రానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) సీఎండీ రాజబాపయ్య వివరించారు.

కడపటి వార్తలు అందే సమయానికి విద్యుత్‌ పునరుద్ధరణ చర్యలు చురుకుగా కొనసాగుతున్నాయి. విద్యుత్‌ శాఖ సలహాదారు రంగనాథం, ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్‌ ఆడమ్స్‌ పరిస్థితిని చక్కదిద్దడానికి శ్రీకాకుళంలోనే మకాం వేశారు. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకూ తుపాను బాధిత ప్రాంతాల్లోనే ఉంటామని ఆడమ్స్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 2,600 మంది సిబ్బందిని రప్పించామని, వాళ్ళంతా రాత్రింబవళ్ళు విద్యుత్‌ పునరుద్ధరణకే కృషి చేస్తున్నారని రంగనాథం వివరించారు. తిత్లీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలకు వీలుగా 400 ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంగా ఉంచారు. 

అయితే, వీటి అవసరం పెద్దగా కన్పించలేదని, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటం తప్ప ట్రాన్స్‌ఫార్మర్లకు నష్టం వాటిల్లలేదని ఈపీడీసీఎల్‌ సీఎండీ రాజబాపయ్య తెలిపారు. వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి మండలాల్లో కొన్ని నెలల క్రితమే తిత్లీ బీభత్సం సృష్టించింది. ఆ సమయంలో ఈ ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్‌ స్తంభాలు, తీగలు వేశారు. ప్రస్తుతం గాలికి వీటిల్లో చాలా వరకు నేలకూలాయి. కొద్ది నెలల్లోనే వీటిని మళ్ళీ వేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. తుపాను తగ్గుముఖం పట్టిన కారణంగా శనివారం సాయంత్రానికి అన్ని గ్రామాలకు విద్యుత్‌ పునరుద్ధరించే అవకాశం ఉందని ఈపీడీసీఎల్‌ అధికారులు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top