ఇంకా వీడని భయం

Daily New Diarrhea Case File In GGH - Sakshi

జీజీహెచ్‌లో రోజుకో కొత్త కేసు

డయేరియా మాట వింటే వణికిపోతున్న నగర ప్రజలు

గుంటూరు మెడికల్‌: నగర ప్రజలు డయేరియా పేరు చెబితే వణికిపోతున్నారు. రోజుకో కొత్త కేసు నమోదవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం నాటికి డయేరియా మహమ్మారి విజృంభించి 20 రోజులు గడిచింది. ఇదే రోజు మరో 13 మంది వైద్య చికిత్స కోసం జీజీహెచ్‌లో చేరడం ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ నెల 3న  21మంది బాధితులు జీజీహెచ్‌లో చేరగా.. 5వ తేదీ నుంచి మరణాలు సంభవించండం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

రోజుకో కేసు..
ఈ 20 రోజుల్లో డయేరియాతో 20 మంది మృతిచెందగా.. 2వేల మంది బాధితులు చికిత్స పొందారు. శుక్రవారం నాటికి గుంటూరు జీజీహెచ్‌లో మొత్తం 40 మందికి వివిధ వార్డుల్లో వైద్య సేవలు అందుతున్నాయి. డయేరియా కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆనందపేట, బారాఇమాంపంజా ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి.

ప్రైవేట్‌ హాస్పిటల్‌లో..
డయేరియా వల్ల కిడ్నీ సమస్య తలెత్తి గుంటూరు రమేష్‌ హాస్పిటల్‌లో మొత్తం 25 మంది చేరగా.. ప్రస్తుతం 12 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. ఈ నెల 15న ఈ ఆస్పత్రిలో ప్రభుత్వ ఖర్చుతో చికిత్స పొందుతున్న సింగంపల్లి నూకరాజు, టి.గంగా భవానీలను జీజీహెచ్‌ వైద్యులు అత్యుత్సాహంతో జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ఇద్దరూ చనిపోవడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున జీజీహెచ్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ మరణాలు జీజీహెచ్‌కు పెద్ద మచ్చగా మిగిలాయి.

భయం.. భయం..
ఈ నెల 3న గుంటూరు తూర్పులో కేవలం మూడు ప్రాంతాల్లో ప్రారంభమైన డయేరియా కేసులు.. నేడు నగరం అంతా వ్యాపించాయి. కార్పొరేష్‌ కుళాయి నీరు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్స్‌ నీరు సైతం కలుషితం అయినట్లు అధికారులు నిర్ధారించారు. ఫలితంగా మినరల్‌ వాటర్‌ తాగాలన్నా ప్రజలు జంకుతున్నారు. నగరంలోని పాతగుంటూరు, ఆనందపేట, పొన్నూరు రోడ్డు, సంగడిగుంట, బారాఇమాంపంజా, చంద్రబాబునాయుడు కాలనీ, గాంధీనగర్, బాలాజీనగర్, ఇందిరప్రియదర్శిని కాలనీ, గుంటూరువారితోట, రాజాగారితోట, చౌత్రాసెంటర్, నల్లచెరువు, పొత్తూరివారితోట, హుస్సేన్‌ నగర్, మంగళదాస్‌నగర్, శారదాకాలనీ, బుచ్చయ్యతోట, లాలాపేట, విద్యానగర్, గుజ్జనగుండ్ల, పట్టాభిపురం, సంపత్‌నగర్, అలీనగర్, కంకరగుంట ప్రాంతాల్లో ఎక్కవ మంది డయేరియా బారిన పడ్డారు.

ఆరు రోజులుగావాంతులు, విరేచనాలు..
వసంతరాయపురం 1వ లైనుకు చెందిన తమ్మినేని మహేష్‌ ఆరు రోజులుగా వాంతులు, విరోచనాలతో బాధపడుతూ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్నారు. వ్యాధి అదుపులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ కాలనీ సాయిబాబా గుడి ప్రాంతానికి ఆదిపూడి సలోమి రెండు రోజులుగా డయేరియాతో బాధపడుతున్నారు. గుంటూరు ప్రాంతానికి చెందిన 23 మంది, జిల్లాలోని ఇతర ప్రాంతాలకు చెందిన 16 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top