
విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో 300 మందికి పైగా డయేరియా బారిన పడ్డా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు విమర్శించారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 13వ తేదీ) న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితుల వైద్య శిబిరాన్ని మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, కార్పోరేటర్ దేవిలు పరామర్శించారు.
అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘న్యూ రాజరాజేశ్వరి పేటలో 300 మందికి పైగా డయేరియా బారిన పడ్డారు. ఇంకా వందమందికి పైగా జీజీహెచ్ లో చికిత్స తీసుకుంటున్నారు. డయేరియా ప్రబలి నాలుగు రోజులు అయినా ప్రభుత్వంలో సరైన స్పందన లేదు. అధికార యంత్రాంగం తూతు మంత్రంగా వ్యవహరిస్తోంది. డయేరియా బాధితులకు సరైన వైద్య చికిత్స కూడా అందించడం లేదు. మంత్రులు మొక్కుబడిగా డయేరియా బాధితులను చూసేందుకు వస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి డయేరియా విషయంలో మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదం.
డయేరియాతో కళ్ళు ఎదుటీ ఒక వ్యక్తి చనిపోతే అది డయేరియా మృతి కాదని కప్పిపుచ్చే చర్యలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేస్తోంది. డయేరియా కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. డయేరియా పరబలి నాలుగు రోజులైనా నేటికీ రిపోర్టు ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మంచినీటి కాలుష్యం కారణంగానే డయేరియా ప్రబలిందని ప్రజలంతా చెపుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరు విత్తనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇంటింటికి మంచి నీటిని ప్రభుత్వం సరఫరా చేయాలి. ట్యాపుల ద్వారా రక్షిత మంచినీరు శుభ్రంగా ఉందా లేదా పరిశీలన చేసిన తర్వాతే వదలాలి. జరిగిన ఘటనపై క్షేత్రస్థాయి విచారణ చేసేందుకు వైఎస్ఆర్సిపి వైద్యుల బృందం ఆదివారం ఉదయం న్యూ రాజరాజేశ్వరి పేటలో పర్యటించనుంది. డయేరియాతో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని మునిసిపల్ మంత్రి కనీసం పరామర్శించకపోవడం, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకపోవడం దారుణం’ అని ధ్వజమెత్తారు.
మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘ డయేరియా ఘటన జరగి నాలుగు రోజులు అయినా దేని కారణంగా డయేరియా వచ్చిందో ప్రభుత్వం తేల్చలేక పోతోంది. లేదంటే రిపోర్టులు వచ్చినా ప్రభుత్వం కావాలనే దాచి పెడుతుందా? అర్థం కావడం లేదు. డయేరియా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’ అని మండిపడ్డారు.