దేశంలో ఏ సెల్ నెట్‌వర్క్ చేయని ప్రయోగాన్ని భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) చేస్తోందని ఆ సంస్థ జిల్లా జనరల్ మేనేజర్ హనుమంతరావు పేర్కొన్నారు.
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: దేశంలో ఏ సెల్ నెట్‌వర్క్ చేయని ప్రయోగాన్ని భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) చేస్తోందని ఆ సంస్థ జిల్లా జనరల్ మేనేజర్ హనుమంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఉన్న సీయూజీ అవకాశాన్ని ఇక నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా అందిస్తున్నామని అన్నారు.
ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఒక్కో సిమ్ రూ. 80 చొప్పుల నెలకు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. 25 మంది కంటే ఎక్కువ ఉంటే రూ. 60కే ఈ ఆఫర్ అందచేస్తున్నామని తెలిపారు.
సిగ్నల్ పెంచేందుకు చర్యలు...
జిల్లాలో సిగ్నల్ వ్యవస్థను పెంపొందించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా 27 నూతన సెల్ టవర్లు(2జీ) ఏర్పాటు చేశామని, మరో ఏడు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 2జీ సెల్ టవర్లు 216, 3జీ సెల్ టవర్లు 23, సీడీఎంఏ టవర్లు 40, వైమాక్స్‌సైట్స్ టవర్లు 10 పని చేస్తున్నాయని అన్నారు.
కొత్త కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వారి కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రవేశపెట్టామన్నారు. అందులో భాగంగా నేస్తమ్ ప్లాన్‌తో సిమ్ రూ.29 పెట్టి కొనుగోలు చేస్తే 60 ఎస్సెమ్మెస్‌లతో పాటు ఎవైనా ఐదు నెంబర్లుకు కాల్‌రేట్లు తగ్గించే అవకాశన్ని కల్పిస్తున్నామన్నారు. రూ.20 పెట్టి సిమ్‌ను కొనుగోలు చేస్తే రెండు సెకన్లకు ఒక్కపైసా ఆఫరును రెండు నెలల పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. రూ.199తో ఆరునెలలపాటు రోమింగ్‌లో ఉచిత ఇన్‌కమింగ్ వర్తిస్తుందని తెలిపారు. ఈ ఆఫర్లు మార్చి 31వ తేదీ వరకు మాత్రమేనని తెలిపారు.
రూ.1000కి పైగా రీచార్జు చేసుకునే వారికి పదిశాతం ఎక్స్‌ట్రా టాక్‌టైంను అందిస్తున్నామన్నారు. అదేవిధంగా రూరల్ ప్రాంతల్లో రూ.250గా ఉన్న బ్రాండ్‌బాండ్ కనెక్షను రూ.100కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కళాశాలల యాజమాన్యాలకు శుభవార్త...
యూనివర్సిటి గ్రాండ్ కమిషన్ (యూజీసీ) అప్రువల్ ఉన్న డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యలకు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ శుభవార్తను ప్రకటించిందని, ప్రస్తుతం ఏడాదికి రూ. లక్షగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ నెట్ కనెక్షన్‌ను రూ. 25,300కే అందిస్తున్నామని తెలిపారు. మిగిలిఇన 74,700ను బీఎస్‌ఎన్‌ఎల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెల్లిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని అన్ని కళాశాలల యాజమాన్యాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గత ఏడాది ఆగస్టు నుంచే ఈ ఆఫర్ అందుబాటులో ఉందని, కళాశాలల యాజమాన్యాలకు తెలియక రాలేదని అన్నారు. పూర్తి వివరాలకు 9490146346, 9490146400 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ వాసుదేవారావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సిద్ధారెడ్డి, డీఈ హరినాథ్‌రావు, బీడీ సుష్మ ,సతీష్, గోపినాథ్ పాల్గొన్నారు.