తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత అవశ్యమో.. పునర్నిర్మాణమూ అంతకంటే ఎక్కువ ముఖ్యమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత అవశ్యమో.. పునర్నిర్మాణమూ అంతకంటే ఎక్కువ ముఖ్యమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అన్ని వర్గాల పాత్ర కీలకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజన అనివార్యమని చెప్పారు. అయితే సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు పోరాటం ఆగదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ విషయంలో ఇప్పటికీ వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నాయని, దీనివల్ల సమస్యల పరిష్కారానికి పోరాటం చేయక తప్పదన్నారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను మాత్రమే ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ విషయంలో కేంద్రం ఎలాంటి పేచీ పెడితే ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని కోరారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతే సంబరాలు చేసుకుందామని కోదండరాం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలన్న సమైక్యవాదుల కుట్రను తిప్పికొట్టాలని డీఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అన్నారు.