 
															బరితెగించిన ‘చేపల’ మాఫియా!
గుడివాడ డివిజన్‌లో చేపల చెరువుల మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరింజేసుకునేందుకు ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనఆలస్యంగా వెలుగు చూసింది.
- అధికారుల సంతకాలు ఫోర్జరీ
- ఆలస్యంగా వెలుగు చూసిన వైనం
- ఇరిగేషన్‌శాఖ ఉద్యోగి హస్తం
- విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
	 గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ డివిజన్‌లో చేపల చెరువుల మాఫియా  తన సామ్రాజ్యాన్ని విస్తరింజేసుకునేందుకు ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఘటనఆలస్యంగా వెలుగు చూసింది.   చేపల చెరువుల అనుమతుల ఫైళ్లలో తమ  సంతకాలు ఫోర్జరీ చేశారని గమనించిన అధికారులు  ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఎస్‌ఈలకు తెలియజేశారు. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగి సాయంతో ఈ వ్యవహారం నడిపించారని అనుమానిస్తున్నారు.
	
	ఆ ఉద్యోగి నెలరోజులుగా సెలవులో ఉండడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.   ఈఏడాది గుడివాడ డివిజన్‌లోని గుడివాడ, నందివాడ, కైకలూరు. మండవల్లి, కలిదిండి మండలాల్లో పెద్ద ఎత్తున చేపల చెరువుల తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే నందివాడ మండలంలోని వివిధ గ్రామాల్లో  20 మంది రైతులు 400 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేశారు.
	
	పోలుకొండ డ్రైనేజీ సెక్షన్ పరిధిలో  రైతులు చేసిన దరఖాస్తులపై డ్రైనేజీ శాఖ జేఈ కవిత, ఆ శాఖ డీఈ హరనాధ్ బాబు  సంతకాలు ఫోర్జరీ చేసి జిల్లా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌కు పంపారు. అయితే చేపల చెరువుల అనుమతుల విషయంలో తాము క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉందని, డ్రైనేజీ గట్లు  ఆనుకుని ఉన్న చెరువుల అనుమతులపై పరిశీలించాల్సి ఉందని  డ్రైనేజీ శాఖ ఈఈ వాసంతి  కలెక్టర్‌కు నివేదిక పంపారు. దీంతో సంబంధిత ఫైళ్లన్నీంటిని కలెక్టర్ రఘునందన్‌రావు వెనక్కి పంపారు.
	
	దీనిపై విచారణకు జేసీని నియమించారు. దీంతో గతనెల మూడో వారంలో జిల్లా జేసీ గుడివాడకు వచ్చి ఇరిగేషన్ డ్రైనేజీ శాఖలతోపాటు, రెవెన్యూశాఖ అధికారులను పిలిపించి మాట్లాడారు. ఫైళ్లను చూపించారు. పోలుకొండ సెక్షన్ పరిధిలో ఉన్న ఫైళ్లను చూసిన డ్రైనేజీ శాఖ డీఈ హరనాధ్‌బాబు, జేఈ కవిత ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ సంతకాలు తమవి కావని తేల్చారు.  ఆ మేరకు జిల్లా కలెక్టర్‌కు, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈకి వీరిద్దరూ  వివరణ ఇచ్చారు.  ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
	
	డ్రైనేజీ డీఈ హరనాద్‌బాబును, డ్రైనేజీ శాఖ పోలుకొండ సెక్షన్ జేఈ కవితను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈవిషయమై తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు  చేశామనిచెప్పారు. తమ సంతకాలు ఫోర్జరీ అయిన విషయం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులు విచారణలో నిజానిజాలు వెలుగులోకొస్తాయని తెలిపారు.
	 
	రెవెన్యూశాఖ తప్పిదాలే ఫోర్జరీలకు దారి తీసిందా?...
	 
	చేపల చెరువుల అనుమతుల విషయంలో రెవెన్యూశాఖది కీలక బాధ్యత. చెరువుల అనుమతులకు 8శాఖల అధికారులతో సమావేశమై సంతకాలు తీసుకోవాల్సి ఉంది.  అలా కాకుండా చేపల చెరువుల యజమానులకు నేరుగా ఫైళ్లు ఇచ్చి ఎవరికి వారే ఆయా శాఖల అధికారుల వద్దకు వెళ్లి   సంతకాలు పెట్టించుకురమ్మని పంపుతున్నారు. ఫలితంగా ఈఫోర్జరీ వ్యవహారానికి తెరలేసినట్లు తేలింది.  
	 
	పరారీలో ఇరిగేషన్‌శాఖ ఉగ్యోగి?
	 
	ఇరిగేషన్‌శాఖ గుడివాడ డివిజన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి ఫోర్జరీ వ్యవహారానికి సాయపడ్డాడని తెలుస్తోంది. పోలుకొండ సెక్షన్ జేఈ ప్రొహిబిషన్‌లో ఉండటంతో ఆమె నిజాయితీగా వ్యవహరిస్తారని తెలిసిన చేపల చెరువుల యజమానులు  ఇరిగేషన్ శాఖఉగ్యోగిని ప్రోత్సహించి ఫోర్జరీ వ్యవహారానికి తెగబడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  విషయం బయట పడిన నాటినుంచి ఇరిగేషన్‌శాఖలో పనిచేసే ఉద్యోగి ఉన్నతాధికారులకు కనీస సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు. గత నెల 18నుంచి ఆయన   విధులకు రావటం లేదని ఇరిగేషన్‌శాఖ డీఈ అనీల్‌బాబు పేర్కొన్నారు.  ఈవ్యవహారంపై  ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపితేనే వాస్తవం తేలుతుందని పలువురు పేర్కొంటున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
