
2025 బడ్జెట్‌లో ప్రవేశ పెట్టుబడి, చట్టంలో చోటు చేసుకున్న టీడీఎస్‌కి సంబంధించిన అంశాల రూల్స్ గురించి ఈ వారం తెలుసుకుందాం. ఇవన్నీ 2025–26 ఆర్థిక సంవత్సరానికి అంటే నడుస్తున్న సంవత్సరానికి అమల్లోకి వచ్చాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లో పెట్టారు. భాగస్వామ్య సంస్థల్లో భాగస్వాములకు జీతం లేదా పారితోషికం మొదలైనవి ఇవ్వడం పరిపాటి. సెక్షన్ 194 క్యూ కొత్తగా వచ్చింది. సంస్థ చేసే చెల్లింపులు సంవత్సరానికి రూ. 20,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది.
ముఖ్యమైన అంశాలు..
2025 ఏప్రిల్ 1 నుంచి అమలు
చెల్లింపులు అంటే జీతం, పారితోషికం, వడ్డీ, కమీషన్, బోనస్. సంస్థ నుంచి పార్ట్‌నర్స్ ఇలా డ్రా చేస్తుంటారు. ఒకప్పుడు వీటిని టీడీఎస్ పరిధిలోకి తీసుకురాలేదు. 2025 ఏప్రిల్ 1 నుంచి వీటన్నింటినీ టీడీఎస్ పరిధిలోకి తెచ్చారు.
భాగస్వామ్య సంస్థలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్షిప్‌లకు వర్తిస్తుంది.
దీనివల్ల కాంప్లయెన్స్, పారదర్శకత పెరుగుతుందని అంటున్నారు. నిజానికి పిలక ముందే దొరుకుతుంది. ముందర కాళ్లకు బంధం.
పైన చెప్పిన ఐదు చెల్లింపులు వెరసి .. ఒక్కొక్కటి కాదు.. అన్నీ జాయింటుగా కలిపి సంవత్సరకాలంలో రూ. 20,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. ఎన్నో విషయాల్లో ఒక్కొక్క చెల్లింపునకు ఒక్కొక్క పరిమితి ఉంది. కానీ ఇక్కడ అన్నీ కలిపి రూ. 20,000 దాటితే, టీడీఎస్ అని అంటున్నారు. ఇది ఇటువంటి చెల్లింపుల మీద ఒక కన్నేసి చూడటమా లేదా కన్నెర్ర చేయడమా తెలియడం లేదు.
పార్ట్‌నర్స్ సాధారణంగా విత్‌డ్రా చేస్తుంటారు. దీన్నే సొంత వాడకాలని అంటారు. ఇటువంటి విత్‌డ్రాయల్స్ మీద ఎటువంటి టీడీఎస్ లేదు. ఇక నుంచి ట్యాక్స్ ప్లానింగ్‌పరంగా ఆలోచించి, విత్‌డ్రాయల్స్ చేయండి.
చెల్లింపులు చేతికి రావడం, లేదా అకౌంటుకి క్రెడిట్ చేయడం.. ఈ రెండు పద్ధతుల్లో ఏది ముందు జరిగితే అప్పుడు టీడీఎస్
వర్తిస్తుంది.టీడీఎస్ రేటు ఎంత అంటే 10 శాతం. వెరసి చెల్లింపులు రూ. 20,000 దాటితే 10 శాతం చొప్పున టీడీఎస్ చేసి, గవర్నమెంట్ ఖాతాలో జమ చేయాల్సిందే.
వెరసి చెల్లింపులు సంవత్సరానికి రూ. 20,000 దాటకపోతే టీడీఎస్ రూల్స్ వర్తించవు.
సెక్షన్ 194 క్యూ ప్రకారం.. జీతాలు, పారితోషికం, కమీషన్, బోనస్, వడ్డీ మొదలైన చెల్లింపులు టీడీఎస్ పరిధిలోకి వస్తాయి.
పార్ట్‌నర్స్‌కి వారి మూలధనం మీద లేదా అప్పు మీద వడ్డీ ఇచ్చే సంప్రదాయం ఉంది. అందరు పార్ట్‌నర్స్ ఒక సమాన మొత్తం క్యాపిటల్‌గా పెట్టలేరు. అలాగే, అందరూ అప్పు ఇవ్వొచ్చు.. ఇవ్వకపోవచ్చు. అదనంగా పెట్టుబడి చేసినందుకు.. ఆదనపు రాబడే ఈ వడ్డీ.
పని చేసినందుకు జీతం ఉంటుంది. స్లీపింగ్ పార్ట్‌నర్స్‌కి జీతం ఉండదు.
అలాగే పారితోషికం లాభాల ఆర్జనను బట్టి ఉంటుంది. అలాగే బోనస్సు.. అలాగే కమీషనూ. అంటే బుక్స్ క్లోజ్ చేసి లాభాల్ని తేల్చాలి. మార్చి 31వి వెంటనే తేల్చాలి. గడువుతేదీ ఏప్రిల్ 30. అందుకే బుక్స్ వెంటనే రాయాలి. ఈ కొత్త అంశాల వల్ల బుక్ రాసే ప్రక్రియ సజావుగా, కరెక్టుగా, సకాలంలో పూర్తవ్వాలి. ఎప్పుడో రిటర్ను వేసే ముందు తీరిగ్గా అకౌంట్లు రాయడం, ఫైనలైజ్ చేయడం కుదరదు.
టీడీఎస్ రికవరీ, చెల్లింపులు.. బుక్స్‌లో కనిపిస్తాయి.
రిటర్నులు దాఖలు చేయాలి. చివరిగా, పార్ట్‌నర్స్‌కి చెల్లింపులు టీడీఎస్ మేరకు తగ్గుతాయి. క్యాష్‌ఫ్లోలు తగ్గుతాయి. సంస్థలో టీడీఎస్ బాధ్యతలు పెరుగుతాయి. ఈ మేరకు సంస్థలు సిద్ధం కావాలి.