ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో గందరగోళం | Counseling for teachers chaos | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌లో గందరగోళం

Jul 13 2015 1:25 AM | Updated on Sep 3 2017 5:23 AM

ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ఆదివారం గందరగోళం, ధర్నాలు, వాగ్వాదాలు, ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నంతో ఒక్కసారిగా

నల్లగొండ రూరల్ : ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ఆదివారం గందరగోళం, ధర్నాలు, వాగ్వాదాలు, ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నంతో ఒక్కసారిగా వాతావరణం ఉత్కంఠకు దారితీసి సోమవారానికి వాయిదా పడింది. రేషనలైజేషన్‌లో ఎత్తేసిన స్కూళ్ల జాబితాలను ముందుగా ప్రకటించకపోవడంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌లో పాల్గొని అనుకూలమైన ప్రాంతాలు లభించకపోవడంతో నాట్ విల్లింగ్ పేర్కొన్నారు. గంటల వ్యవధిలోనే రేషనలైజేషన్‌లో స్కూళ్లు ఎత్తేసినట్లుగా ఆన్‌లైన్‌లో సమాచారం ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. స్పౌజ్ కేసుల్లో కూడా స్పష్టత లేకపోవడం వివాదాస్పదంగా మారింది. గంటకో నిబంధన, పూటకో రూలు అమలు చేయడం,  మొత్తం మీద కౌన్సెలింగ్ గందరగోళంగా, వివాదాస్పదంగా మారింది.
 
 తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు ఉపాధ్యాయులు పెట్రోల్ సీసాతో ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టడం ఉపాధ్యాయుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌కు సమాచారం ఇవ్వడంతో కౌన్సెలింగ్ హాల్‌లో ఉండి పర్యవేక్షించారు. పారదర్శకంగా నిబంధనల ప్రకారం ఇబ్బందులు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎమ్మెల్సీ పూల రవీందర్.. డీఈఓ ఎస్.విశ్వనాథరావు, ఏజేసీ వెంకట్రావ్‌లకు సూచించారు. ఇదే విషయమై ఆయన కలెక్టర్‌తో కూడా మాట్లాడారు. యూటీఎఫ్, ఏపీటీఎఫ్ సంఘాలు ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాయి. పీఆర్‌టీయూ, ఎస్టీయూ, ఆపస్, పీఈటీ, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీకి అనుకూలంగా నినాదాలు చేశాయి. ఈదశలో ఉపాధ్యాయ సంఘాలు రెండుగా చీలి పోటా పోటీ ధర్నాలకు తెర తీశాయి.
 
 ఆత్మహత్యాయత్నం..
 నకిరేకల్ బాలికల హైస్కూల్‌ను రేషనలైజేషన్‌లో ఎత్తేశారు. అక్కడ పనిచేస్తున్న స్వరూప ఈ విషయం తెలియకపోవడంతో సాధారణ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. స్పౌజ్ కేసును పరిగణించాలని కేతేపల్లిలో పనిచేస్తున్న భర్త శ్రీనివాస్ డీఈఓను అభ్యర్థించారు. దీనికి డీఈఓ నిరాకరించారు. దీంతో భర్త శ్రీనివాస్ తనకు న్యాయం జరగలేదని ఆవేదనతో పెట్రోల్ సీసాతో ఎమ్మెల్సీ పూల రవీందర్ ముందే ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కాళ్లావేళ్లా పడ్డా డీఈఓ కనికరించకపోవడంతో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. రేషనలైజేషన్‌లో హైస్కూల్‌ను తొలగిస్తున్నట్లుగా ఆన్‌లైన్‌లో లేకపోవడం, ఉపాధ్యాయులకు సమాచారం లేకపోవడంతో గందరగోళానికి దారితీసింది.
 
  అదే విధంగా బాలికల హైస్కూల్ రేషనలైజేషన్‌లో ఉంది. ఈ విషయం ముందుగానే ప్రకటించకపోవడం వివాదాస్పదంగా మారింది. ఖాళీల జాబితాను ముందుగానే ప్రకటించకపోవడంతో డీఈఓ తీరుకు నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు మండిపడ్డాయి. డీఈఓ వద్ద ఉన్న ఖాళీ పోస్టుల వివరాలను బహిర్గతం చేయాలని, స్పౌజ్ జాబితాను 2008 నుంచి ప్రకటించాలని, రేషనలైజేషన్ పాఠశాల జాబితాను బహిర్గతం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీ పూల రవీందర్ అధికారులకు సూచించారు. ఆదివారం జరగాల్సిన గణితం, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ సోమవారానికి వాయిదా పడింది.
 
 ఖండించిన ఉపాధ్యాయ సంఘాలు..
 ఎమ్మెల్సీ రవీందర్‌కు వ్యతిరేకంగా సభ్యులు లేని కొన్ని సంఘాలు పనిగట్టుకుని కౌన్సెలింగ్‌లో గందరగోళం సృష్టించడాన్ని ఖండిస్తున్నట్లు  ఉపాధ్యాయ సంఘాల నేతలు భిక్షపతి, నర్సిరెడ్డి, భిక్షంగౌడ్, కృష్ణమూర్తిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement