పత్తి రైతు దగా | cotton farmer doing fraud | Sakshi
Sakshi News home page

పత్తి రైతు దగా

Dec 26 2013 2:50 AM | Updated on Oct 1 2018 2:44 PM

ప్రభుత్వం జిల్లాలో సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా)కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవటం వ్యాపారులకు, దళారులకు వరంగా మారింది.

 ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: ప్రభుత్వం జిల్లాలో  సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా)కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవటం వ్యాపారులకు, దళారులకు వరంగా మారింది. పత్తి ధర క్వింటాల్‌కు రూ.4000 నుంచి రూ.4400ల వరకు ఉన్నా వ్యాపారులు ఆ ధర పెట్టకుండా రైతులను దోచుకుంటున్నారు. తుపానులు, అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది పత్తి పంట దిగుబడి తగ్గింది. దీంతో ఆ పంట ఉత్పత్తికి డిమాండ్ ఉన్నా వ్యాపారులు కుంటి సాకులు చెబుతూ నాణ్యత ఉన్న సరుకుకు కూడా తక్కువ ధర పెడుతున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4000గా నిర్ణయించింది. ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి తేమశాతం ఆధారంగా మద్దతు ధరతో రైతు సరుకును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాలు, నాణ్యత లేమి వంటి సాకులతో సీసీఐ సరుకు కొనుగోలుకు ముందుకు రాలేదు. జిల్లాలో 12 సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల సరుకును కొనుగోలు చేయించాలని జిల్లా అధికార యంత్రాగం ప్రణాళిక రూపొందించింది. అయితే ఆచరణలో విఫలమైంది. కేవలం 5 కేంద్రాలను మాత్రమే ప్రారంభించి కొనసాగిస్తోంది.
 
  పత్తి కొనుగోళ్లలో సీసీఐ వెనుకంజ వేయటాన్ని వ్యాపారులు ఆసరాగా చేసుకున్నారు. మార్కెట్‌లలో సీసీఐ కేంద్రాల ఏర్పాటు చేయకపోవటంతో గ్రామాల్లోనే పంట ఉత్పత్తిని అమ్ముకుంటున్నారు. వర్షాల కారణంగా పంట నాణ్యత కోల్పోయిందని, తేమశాతం అధికంగా ఉందని, పంట రంగు మారిందని రకరకాలుగా సాకులు చెబుతూ క్వింటాల్ పత్తిని గ్రామాల్లో రూ.3000 నుంచి రూ.3400 వరకే కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌లలో రూ.3000 నుంచి రూ.3600 వరకు పెడుతున్నారు.  ధరలో దగా చేయటంతో పాటు, కాంటాలలోనూ దోపిడీ చేస్తున్నారు. మాన్యువల్ కాంటాలను వినియోగిస్తూ తక్కువ తూకం చూపిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. కాంటాలలో  ఒక్కో క్వింటాల్ 5 నుంచి 10కిలోల మోసం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌లలో కూడా తూకాల్లో మోసం జరుగుతోంది. ఎలక్ట్రానిక్ కాంటాల విధానం అమలు జరుగుతున్నా, ఎలక్ట్రానిక్ రీడింగ్ రైతులకు అర్థంగాక పోవటం, గ్రాములను లెక్కలోకి తీసుకోక పోవంటతో ఇక్కడ కూడా మోసం జరుగుతుంది.
 
  ఒక వైపు సీసీఐ కేంద్రాలు  ఏర్పాటు చేయకపోగా, మరో వైపు అక్రమ వ్యాపారాలు చేసే వారిని నిరోధించడంలో కూడా అధికారులు విఫలమయ్యారు. వ్యాపారుల, దళారుల అక్రమాలు అధికారుల అండదండలతోనే జరుగుతున్నాయని రైతులు  ఆరోపిస్తున్నారు. వర్షాలు, తుపానుల కారణంగా దిగుబడులు తగ్గి నష్టాల ఊబిలో ఉన్న రైతులను వ్యాపారుల దగా కన్నీరే మిగిల్చుతోంది. అధికారులు స్పందించి  కాంటాలలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని, గిట్టుబాటు ధర అందేవిధంగా చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement