వీళ్లు సామాన్యులు కాదు | Sakshi
Sakshi News home page

వీళ్లు సామాన్యులు కాదు

Published Mon, Jun 4 2018 9:05 AM

Corruption In Chittoor Corporation - Sakshi

ప్రజాధనాన్ని దోచుకోవడానికి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ నేతలు వదులుకోవడం లేదు. ఇందుకు చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం చిరునామాగా నిలుస్తోంది. చేయని పనులకు తప్పుడు బిల్లులు సృష్టించిన టీడీపీ నేతలు రూ.78 లక్షల ప్రజాధనాన్ని జేబుల్లో వేసుకున్నారు. తప్పుడు పనులకు ఫైలు సృష్టించిన అధికారులకు పర్సెంటేజీల రూపంలో మామూళ్లు అందజేశారు.

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో నాలుగేళ్ల కాలంలో జేసీబీలకు చెల్లించిన అద్దె రూ.78 లక్షలు. ఏంటీ అవాక్కయ్యారా..? నిజమండీ బాబు. ఇది మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ చిట్టా పద్దుల్లో రాసుకున్న అక్షర సత్యం. రోడ్లు వేయాలంటే సిమెంటు కొనాలి. కమ్మి, రాళ్లు, కూలి ఇవ్వడంతో పాటు పెట్టుబడి కూడా పెట్టాలి. రూ.లక్ష పెట్టుబడి పెట్టి నాణ్యతగా రోడ్డు వేస్తే రూ.8 వేలు మిగిలే అవకాశముంది. అది కూడా అధికారులకు ఎలాంటి మామూళ్లు ఇవ్వకపోతే.

కానీ పైసా పెట్టుబడి పెట్టకుండా, క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా గమ్మత్తుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఒకే ఒక్క అవకాశం జేబీసీకే దక్కుతుంది. మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు తీశామని, రోడ్డుకు పక్కనున్న మట్టిని తీయించామని, చెరువు కట్టపై పిచ్చి మొక్కలు తొలగించామని, చెరువుకట్ట తెగ్గొట్టడానికి, కట్టను పూడ్చడానికి, రోడ్డు విస్తరణ పనులు అబ్బో ఇలా చాలా కారణాలను కష్టపడి మరీ కనుక్కుని రికార్డుల్లోకి ఎక్కించారు. ఇలా పలు కారణాలకు నాలుగేళ్ల కాలంలో జేసీబీని ఏకంగా 464 రోజులు వినియోగించినట్లు బిల్లులు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా కార్పొరేషన్‌ కార్యాలయంలోని ఒక్క పారిశుద్ధ్య విభాగంలోనే రూ.అరకోటి దోచేశారు.

అందరికీ వాటాలు..
పక్కాగా చేసిన పనులకైతే ఏ ఒక్కరికీ వాటాలు, లంచాలు ఇవ్వాల్సిన అసరంలేదు. చేయని పనులకు, తప్పుడు పనులకు, నాణ్యత లేని పనులకు తప్పకుండా వాటాలు పంచాల్సిందే. జేసీబీల ద్వారా పనులు చేయకుండానే టీడీపీ చెందిన 18 మంది కార్పొరేటర్లు రూ.62 లక్షల బిల్లులు బినామీల పేరిట కాజేశారు. ఇదే సమయంలో వాస్తవ పనులకు జేబీసీ పెట్టిన పలువురికి ఇప్పటికీ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. నేతలు చూపించిన దారి మున్సిపల్‌ కార్యాలయంలోని ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మరో గుమాస్తా, ఇంజనీరింగ్‌ విభాగంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేసే మరో గుమస్తాకు బాగా కలిసి వచ్చింది. జేసీబీల పేరిట తప్పుడు బిల్లులు సృష్టించి రూ.7 లక్షల వరకు జేబుల్లో వేసుకున్నారు. టీడీపీ నేతలకు ఈ విషయం తెలిసినా అడగలేని పరిస్థితి. అడిగితే తమ బాగోతం బయటకొస్తుందనే భయంతో మిన్నకుండిపోతున్నారు. బిల్లుల మంజూరులో ఓ ఇంజినీరు, గణాంక శాఖ విభాగంలోని మరో అధికారి, గుమస్తాకు రూ.2 లక్షల వరకు వాటాలు చేరాయని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొత్తవే కొనేయొచ్చు..
నాలుగేళ్లలో జేసీబీలకు పెట్టిన ఖర్చుతో మూడు కొత్త జేసీబీ యంత్రాలను కొనచ్చు. ఒక్కో కొత్త యంత్రం రూ.28 లక్షలే. ఇక మంచి కండీషన్‌లో ఉన్న సెకండ్‌హ్యాండ్‌ యంత్రాలైతే ఏకంగా ఎనిమిదింటిని కొనేయచ్చు. ఇదంతా అధికారులకు తెలియనివా అంటే అన్నీ తెలుసనే చెప్పాలి. తప్పదన్నట్లు కొన్ని.. తమకెంత అని మరికొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. విజిలెన్స్‌ లాంటి విభాగాలు ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే జరిగిన అవకతవకలు బయటపడే అవకాశముంది.

Advertisement
Advertisement