ఏపీలో ఇన్‌ఫెక్షన్‌ 1.6 శాతమే | Coronavirus outbreak and infection rate in AP is very low | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇన్‌ఫెక్షన్‌ 1.6 శాతమే

Apr 26 2020 2:44 AM | Updated on Apr 26 2020 2:44 AM

Coronavirus outbreak and infection rate in AP is very low - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ రేటును చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో చాలా తక్కువగానే ఉంది. తాజా గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. జాతీయ సగటుకంటే మన రాష్ట్రంలో ఇది చాలా మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైంది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో జరిగిన టెస్టులను పరిశీలిస్తే అక్కడ 6.4 శాతం నుంచి 8.6 శాతం వరకు ఇన్‌ఫెక్షన్‌ రేటు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అత్యధికంగా 8.64 శాతం ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర 7.15, మధ్యప్రదేశ్‌ 7.03, గుజరాత్‌లో 6.42 శాతం ఇన్‌ఫెక్షన్‌ రేటు ఉంది. కానీ, మన రాష్ట్రంలో మాత్రం అది కేవలం 1.66 మాత్రమే. అదే జాతీయ సగటు 4.23 శాతం. శనివారం సాయంత్రం వరకు జరిగిన టెస్టులు, వచ్చిన పాజిటివ్‌ కేసుల శాతాన్ని లెక్కించగా ఈ విషయం వెల్లడైంది. ఇలా అనేక రాష్ట్రాలు ఏపీ కంటే ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌ రేటుతో ఉండడం గమనార్హం. ఈ రేటును ఇప్పటివరకు జరిగిన టెస్టులు, నమోదైన పాజిటివ్‌ కేసుల ఆధారంగా శాతాన్ని లెక్కిస్తారు. ఇదిలా ఉంటే.. అత్యధిక టెస్టుల నిర్వహణలోనూ మన రాష్ట్రం అన్నింటి కంటే అద్భుతమైన ప్రగతి కనబరుస్తూ అగ్రగామిగా ముందుకు దూసుకెళ్తోంది.

రాష్ట్రంలో టెస్టులు ఇలా..
► రాష్ట్రంలో పది లక్షల మంది జనాభాకు 1,147 టెస్టులు చేస్తున్నారు
► గత 24 గంటల వ్యవధిలో 6,928 టెస్టులు జరిగింది ఒక్క ఏపీలోనే
► అదే దేశవ్యాప్త సగటు పది లక్షల మంది జనాభాకు కేవలం 418 మాత్రమే.
► దేశమంతటా 5.79 లక్షల టెస్టులు జరగ్గా, ఒక్క ఏపీలోనే 61,266 టెస్టులు జరిగాయి.
► ఇక్కడ 9 వైరాలజీ ల్యాబ్‌లు, 225 ట్రూనాట్‌ మెషీన్ల ద్వారా యాంటీజెన్‌ టెస్టులు చేస్తున్నారు.
► హాట్‌స్పాట్‌లు, రెడ్‌జోన్‌లో ఉన్నవారు, 60 ఏళ్లు దాటిన వారికి లక్షణాలున్నా చేస్తున్నారు.
► క్వారంటైన్‌లో ఉన్న వాళ్లందరికీ విధిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
► పాజిటివ్‌ బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులన్నింటికీ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.
► ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కువ మందికి పరీక్షలు చేసి ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు.
► దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా ప్రతీ వంద మందిలో 8.64 శాతం మందికి ఇన్ఫెక్షన్‌ రేటు ఉంది.

ఏపీలో ‘పాజిటివ్‌’ తక్కువ
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి ఇదే విషయమై శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో సగటున పాజిటివ్‌ కేసుల శాతం 4.23 శాతం ఉండగా రాష్ట్రంలో ఇది కేవలం 1.66 శాతం మాత్రమేనని చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాజిటివ్‌ కేసుల శాతం తక్కువగా ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
– గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,928 పరీక్షలు చేశాం. ఇందులో 61 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి.
– శాంపిల్స్‌ ఎక్కువగా చేస్తున్నాం. అయినా పాజిటివ్‌లు తక్కువగా ఉన్నాయి.
కోవిడ్‌ ప్రధాన లక్షణంగా హైపాక్సియాగా గుర్తించాం. అంటే.. రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గి ఊపిరి తీసుకోలేకపోవడం.
– ఈ లక్షణం ఉన్న వారందరూ 104కు గానీ, సమీపంలోని డాక్టర్‌నుగానీ సంప్రదిస్తే వైద్య పరీక్షలు చేస్తాం.
– రక్తంలో ఆక్సిజన్‌ శాతం నియంత్రణకు 1,900 పల్సాక్సీ మీటర్లు కొనుగోలు చేసి ఆస్పత్రులకు పంపించాం.
– అలాగే, 1,170 మెడికల్‌ ఆఫీసర్లను నియమించి వివిధ కోవిడ్‌ ఆస్పత్రులకు పంపించాం.

పాత క్లస్టర్లలోనే కొత్త కేసులు
– కాగా, శనివారం నమోదైన 61 కేసుల్లో 51 కేసులు పాత క్లస్టర్లలోనే నమోదయ్యాయి.
– దీంతో తాజాగా క్లస్టర్ల సంఖ్య 189 నుంచి 196కు పెరిగింది.
– ఇందులో పట్టణాల్లో 122, గ్రామాల్లో 74 క్లస్టర్లు ఉన్నాయి.
– తొలిసారి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చెందిన ముగ్గురికి పాజిటివ్‌ నమోదైంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తితో సోకినట్లు నిర్ధారణ అయింది.
– ఇక ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, డెంటల్, ఆయుష్, పారామెడిక్‌ వంటి వారు మొత్తం 22,600 మంది సేవలు చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు
– వివిధ ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చినందున అక్కడ డయాలసిస్‌ చికిత్స పొందుతున్న 718 మంది బాధితులను వేరే ఆస్పత్రులకు మార్చాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement