రెండు రోజులుగా విమానాశ్రయంలోనే.. 

Coronavirus Effect; Telugu Students Facing Problems In Philippines - Sakshi

ఫిలిప్పీన్స్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు

స్వదేశానికి రాలేక ఇబ్బందులు 

కరోనా నేపథ్యంలో ఆందోళన

ఇద్దరిది శ్రీకాకుళం జిల్లా  

రణస్థలం: కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీని విజృంభణకు విదేశాలకు వెళ్లిన భారతీయులంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం ఫిలిప్పీన్స్‌ వెళ్లిన 400 మంది విద్యార్థులు తిరిగి దేశానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరి దేశాలకు వారు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించడంతో ప్రయాణాలకు సిద్ధపడిన విద్యార్థులు విమాన సర్వీసులు రద్దయిపోవడంతో రెండు రోజులుగా మనీలా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. రణస్థలం మండలం జేఆర్‌ పురానికి చెందిన జి.సాయినిఖిల్, లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన ఎం.నరేష్‌ కూడా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కరోనా నేపథ్యంలో ఇక్కడ పడుతున్న ఇబ్బందులను ఇలా వివరించారు..(ఏపీలో మరో 2 కరోనా పాజిటివ్‌ కేసులు)

‘ఫిలిప్పీన్స్‌లో మన దేశానికి చెందిన 400 మంది విద్యార్థులం ఎంబీబీఎస్‌ చదువుతున్నాం. నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నాం. ఇందులో 85 మంది తెలుగు వారే. మూడు రోజుల కిందట ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం విదేశీయులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. దీంతో ఇండియా వచ్చేందుకు విమాన టికెట్లు తీసుకుని అంతా మనీలా ఎయిర్‌పోర్టుకు వచ్చాం. కానీ రెండు రోజులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ విమానాశ్రయం మూసేస్తున్నట్లు ప్రకటించారు. విమాన సరీ్వసులు రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో మాకేమీ పాలు పోవడం లేదు. టికెట్‌ రూ. 30వేలు పెట్టి కొన్నాం. రిఫండ్‌ వస్తుందో రాదో తెలీడం లేదు. ఉండేందుకు వసతులు లేవు. తిరిగి రూములకు వెళ్లిపోదామంటే ఉండేందుకు డబ్బులు లేవు. ఇక్కడి ప్రభుత్వం మాకేమీ సహకరించడం లేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి రాక కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
(తాత్కాలికంగా శ్రీవారి దర్శనం రద్దు)  

ప్రభుత్వమే రప్పించాలి 
విమాన టికెట్లు బుక్‌ చేసుకొని విమానాశ్రయానికి చేరుకుంటే విమానాలు రద్దు చేస్తున్నాం, విమానాశ్రయమే మూసేస్తున్నాం అని చెబితే చదువు కోసం వెళ్లిన విద్యార్థులు ఏం చేయగలరు..? భోజనాలు కూడా దొరకడం లేదంట. ప్రభుత్వమే వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలి. – కల్యాణకుమార్‌ రాజా, విద్యార్థి నిఖిల్‌ తండ్రి  

ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు 
ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం మూడు రోజులు గడువిచ్చి స్వదేశాలకు వెళ్లిపొమ్మంది. ఈ లోగానే విమాన సరీ్వసులు రద్దయిపోయాయి. మనీలా విమానాశ్రయం మూసేస్తున్నారని మా అబ్బాయి ఫోన్‌ చేసి చెప్పాడు. కరోనా వల్ల వారు ఏం ఇబ్బందులు పడుతున్నారో..? ప్రభుత్వం చొరవ తీసుకుని వారిని రప్పించాలి.– ఎం.గోవిందరావు, విద్యార్థి నరేష్‌ తండ్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top