వారంలో జిల్లా గ్రీన్‌జోన్‌

Coronavirus Control in SPSR Nellore Green Zone Soon - Sakshi

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

నెల్లూరు(అర్బన్‌): రానున్న వారంరోజుల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చి జిల్లా సాధారణ స్థితికి వస్తుందని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం రాత్రి కరోనా కేసులు, అధికారులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై స్థానిక జెడ్పీ కార్యాలయంలోమంత్రి సమీక్ష నిర్వహించారు. సూళ్లూరుపేటలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులకు రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో మంచి భోజనం, వసతి కల్పించాలన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మరో 90 కేసులు కోయంబేడు మార్కెట్‌ లింకులతో వచ్చాయన్నారు. వీటిలో 70 కేసుల వరకు సూళ్లూరుపేట పట్టణంలోనే ఉన్నాయన్నారు. అధికారులు తీసుకున్న చర్యలు, డాక్టర్లు చేస్తున్న నాణ్యమైన వైద్యం వల్ల రోగులు త్వరితగతిన కోరుకుంటున్నారని తెలిపారు.

మార్గదర్శకాలు విడుదల
లాక్‌డౌన్‌ నేపథ్యంలో దుకాణాలు తెరవడం, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు మున్సిపల్‌ కమిషనర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సమావేశమై మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. ప్రజలు కూడా గుమిగూడకుండా, మాస్క్‌లు ధరించి, పరిశుభ్రత పాటిస్తూ కొనుగోళ్లు చేయాలని సూచించారు. ప్రభుత్వానికి సహకరించాలని, తద్వారా కరోనాను నియంత్రిద్దామని కోరారు. కలెక్టర్‌ శేషగిరిబాబు మాట్లాడుతూ వలస కార్మికులకు ఆశ్రయం కల్పించడంతోపాటు వారిని స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న మొదటి, ద్వితీయ కాంటాక్ట్‌ అయిన వ్యక్తులకు త్వరితగతిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిన వారిని ఇంటికి పంపాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్, జేసీ వినోద్‌కుమార్, జేసీ–2 ప్రభాకర్‌రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్‌ బాపిరెడ్డి, జెడ్పీ సీఈఓ సుశీల, డీఆర్వో మల్లికార్జున, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top