వారిని అనుమతించేది లేదు : ఏపీ డీజీపీ | Coronavirus AP DGP Gowtham Sawang Says Others Not Allowed Now | Sakshi
Sakshi News home page

ఎక్కడివారు.. అక్కడే ఉండాలి : ఏపీ డీజీపీ

Mar 26 2020 4:00 PM | Updated on Mar 26 2020 4:08 PM

Coronavirus AP DGP Gowtham Sawang Says Others Not Allowed Now - Sakshi

సాక్షి, విజయవాడ : నిబంధనలకు విరుద్దంగా ఏపీ సరిహద్దు వద్దకు వస్తున్నవారిని రాష్ట్రంలోకి అనుమతించేది లేదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. రెండు వారాలపాటు క్వారంటైన్‌ నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు జోడించి చేసిన అభ్యర్థనని అర్థం చేసుకొని అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

నిబంధనలు పాటించకుండా సరిహద్దు వద్దకు వచ్చిన వారిని కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్‌ నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని స్ఫష్టం చేశారు. లాక్ డౌన్ ఉదేశ్యం ఒక మనిషి నుండి మరొక మనిషికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి  కరోనా సంక్రమించకండా ఉండేలాగా చేయడమేనని.. బయట ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనికి అనుమతించడం లాక్‌డౌన్‌ ఉద్దేశ్యాన్ని నీరు గార్చడమేనన్నారు. పరిస్థితిని ఆర్థం చేసుకొని ఎక్కడివారు అక్కడే స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఙప్తి చేశారు. 

సరిహద్దులో వందలాది వాహనాలు నిలిపివేత
లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పయనమైన విద్యార్థులు, ఉద్యోగులను ఏపీ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం లేదు. కరోనావైరస్‌ ప్రభావంతో ఆంధ్ర లోకి అనుమతి లేదని.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని తేల్చి చెప్పారు. దీంతో వందలాది వాహనాలు సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. ఆంధ్రాలోకి రాకుండా తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని, ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చేవరకు ఏమి చేయలేమని పోలీసులు తెలిపారు.

కాగా, హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా హాస్టల్స్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అందరిని తమ స్వగృహాలకు వెళ్లేందుకు బుధవారం రాత్రి తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వడంతో.. వారంతా సొంత వాహనాల్లో ఏపీకి బయలుదేరారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం నెర్సుగూడెం ఆంధ్రా తెలంగాణ సరిహద్దు వద్దకు రాగానే వారి వాహనాలను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రలోకి రాకుండా తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయంటూ ఏపీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే తెలంగాణ అధికారులు తమకు  పర్మిషన్ ఇస్తేనే  వచ్చామని, తీరా సరిహద్దుకు వచ్చాక ఆంధ్రా పోలీసులు అనుమతి ఇవ్వడంలేదని.. దయచేసి తమను ఇంటికి వెళ్ళనివ్వండి అంటూ ప్రయాణికులు పోలీసులను వేడుకుంటున్నారు. 

కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు బయలుదేరిన 150 మంది విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి బ్యాంకు కోచింగ్‌ కోసం కొద్ది రోజుల క్రితం నంద్యాలకు వచ్చారు. అయితే అక్కడ హాస్టల్స్‌ మూసివేడయంతో పోలీసులు అనుమతితో 12 వాహనాల్లో ఉత్తరాంధ్రకు బయలుదేరగా.. కృష్ణా జిల్లా గుడివాడలో వారి వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక పంపిస్తామని చెప్పి.. ఓ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో భోజన వసతి ఏర్పాటు చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో సొంత గ్రామాలకు పంపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement