ఏపీ: దీక్షా శిబిరాలను ఖాళీ చేయండి

Corona Impact: Health Officials Issue Notice To JAC in Amaravati - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో చేస్తున్న దీక్షలను విరమించాలని అధికారులు కోరారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాపించకుండా చేపడుతున్న ముందస్తు జాగ్రత చర్యల్లో భాగంగా వైద్య శాఖ అధికారులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీక్షా శిబిరాలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. రైతుల జేఏసీ పేరుతో జరుగుతున్న ఎర్రపాలెం, కృష్ణాయపాలెం, మందడం, రాయపూడి, వెలగపూడి పెదపరిమి, తుళ్లూరు దీక్షా శిబిరాలను ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఖాళీ చేయాలని నోటీసుల్లో సూచించారు.

పాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌ బహుజన పరిరక్షణ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సెస్‌ రహదారి డి–జంక్షన్‌ వద్ద చేపట్టిన దీక్షా శిబిరాలను కూడా ఖాళీ చేయాలని వైద్య శాఖ అధికారులు కోరారు. కాగా, వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన దీక్షలు శనివారానికి 13వ రోజుకు చేరాయి. (కరోనా వైరస్‌: ప్రతి ఇంటిని సర్వే చేస్తున్నాం)

కరోనా మహమ్మారి విజృంభించకుండా దేశంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తున్నామని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని శనివారం తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఈరోజు (శనివారం) రాత్రి నుంచే నిలిపివేస్తున్నామని ప్రకటించారు. (జనతా కర్ఫ్యూకు ఇలా సిద్ధమవుదాం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top