మోడల్.. మోసాల్!

మోడల్.. మోసాల్! - Sakshi


 338 మోడల్ బడుల నిర్మాణాల్లో మరో మాయ

  కాంట్రాక్టర్లకు కోట్లు దోచిపెట్టే ఎత్తుగడ

  విద్యాశాఖ అనుమతి లేకుండా డిజైన్ మార్పు

  పైగా ఒక్కో బడిలో ఐదారు గదులు తగ్గించి నిర్మాణం

 మిగతా గదులేవని అడిగితే.. చేతులెత్తేసిన మౌలిక సదుపాయాల కార్పొరేషన్

 

 సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్ల నిర్మాణాల్లో మరో అక్రమానికి రంగం సిద్ధమైంది. పెరిగిన ధరలు, డిజైన్ మార్పు పేరుతో కాంట్రాక్టర్లకు రూ.84 కోట్లుదోచిపెట్టే చర్యలకు పూనుకుంది. ఆ మేరకు.. ఒక్కో స్కూల్‌కు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు అదనంగా ఇస్తేనే ఒప్పందం మేరకు అన్ని గదుల నిర్మాణం పూర్తి చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఈడబ్ల్యూఐడీసీ) మెలిక పెట్టింది. ఈ లెక్కన 338 మోడల్ స్కూళ్లలో నిర్మాణాలన్నీ పూర్తి చేయాలంటే కనీసంగా రూ.84 కోట్లు ఇవ్వాలంటోంది. లేదంటే అంతేనంటూ చేతులు దులుపుకొంటూ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతోంది. అసలు ఒక్కో స్కూల్లో 36 గదులను నిర్మించాల్సి ఉండగా.. 30 వరకే గదులను నిర్మించి.. అన్నీ పూర్తయ్యాయంటూ ఏపీఈడబ్ల్యూఐడీసీ విద్యాశాఖకే షాక్ ఇచ్చింది. మొదట్లో ఒక్కో మోడల్ స్కూల్లో అవసరమైన గదుల నిర్మాణానికే వేర్వేరుగా (స్కూల్ వారీగా) టెండర్ పిలువాలని అధికారులు నిర్ణయిస్తే.. కాదు కాదు ప్యాకేజీలుగా అన్ని గదులకు టెండర్లు పిలువండంటూ అమ్యామ్యాల కోసం ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇపుడు కేటాయించిన డబ్బు సరిపోదని, అదనంగా ఇస్తేనే నిర్మాణాలు పూర్తి చేస్తామంటూ కార్పొరేషన్ మరో అడ్డగోలు వ్యవహారానికి తెరతీసింది. కొంతమంది కాంట్రాక్టర్లతో ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై ఈ అక్రమ బాగోతానికి సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

 అడుగడుగునా నిర్లక్ష్యం.. అడ్డగోలు విధానాలు..

 రెండేళ్లు గడిచినా అన్ని నిర్మాణాలూ పూర్తి చేయని కార్పొరేషన్, సర్కారు ఇష్టారాజ్య విధానాలు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టే వ్యవహారాలు మోడల్ స్కూళ్లకు శాపంగా మారాయి. 2010 డిసెంబర్‌లో 355స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో 2011లో రూ. 919 కోట్లతో 338 స్కూళ్ల నిర్మాణాలను చేపట్టినా ఇప్పటికీ పూర్తి చేయలేకపోయింది. కార్పొరేషన్ అధికారులే 2011లో వీటి నిర్మాణాలకు డిజైన్స్ వేశారు. ఒక్కో స్కూల్లో 36 గదులను రూ. 2.72 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు పనులను అప్పగించారు. ఒప్పందం ప్రకారం 36 గదులను నిర్మించి విద్యాశాఖకు అప్పగించాలి. ఈ ఒప్పందం ప్రకారమే నిర్మాణాలు ప్రారంభించారు. అయినా ఇప్పటివరకు అన్ని నిర్మాణాలను పూర్తి చేయించలేకపోయారు.

 

 టెండరు నిబంధనలను తుంగలో తొక్కి..

 కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై టెండర్ నిబంధనలను తుంగలో తొక్కారు. ఒక్కో స్కూల్లో 36 గదులను నిర్మించాల్సి ఉన్నా 30 - 31 గదులనే నిర్మించారు. ఈ విషయాన్ని విద్యాశాఖకు చివరి వరకు తెలియజేయలేదు, ఆమోదమూ తీసుకోలేదు. ఇటీవల ప్రారంభించేందుకు అప్పగించిన 212 స్కూళ్ల భవనాల్లో 30-31 గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయిన విద్యాశాఖ.. మిగతా గదుల సంగతేంటని అడిగితే.. అంతేనంటూ కార్పొరేషన్ చేతులెత్తేసింది. దీంతో విద్యాశాఖ కంగుతింది. ఒప్పందం ప్రకారం ఒక్కో స్కూల్లో 36 గదులు నిర్మించి ఇవ్వాల్సి ఉంది కదా! అని అడిగితే.. డిజైన్స్‌ను గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్‌కు కాకుండా సెకండ్ ఫ్లోర్ కోసం మార్చడం వల్ల, ఇసుక, సిమెంటు ధరలు పెరుగడం వల్ల మిగితా ఐదారు గదులను నిర్మించలేకపోతున్నామని, వాటిని నిర్మించాలంటే అదనంగా రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షలు ఇవ్వాలని పేర్కొంటోంది. దీంతో ఏం చేయాలో తెలియక విద్యాశాఖ తల పట్టుకుంది. అయితే ఈ వ్యవహారంలో ఒప్పందాన్ని తుంగలో తొక్కి నిర్మాణాల్లో ఆలస్యం ఎందుకు చేశారు? ఇసుక, సిమెంటు ధరల పెరుగుదల ముందుగా తెలియదా? డిజైన్స్ మార్చమన్నదెవరు? పునాది దశలోనే డిజైన్స్ మార్చినపుడు విద్యాశాఖ లేదా ప్రభుత్వ ఆమోదం ఎందుకు తీసుకోలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

 

 అన్నీ అసంపూర్తే..

 ఐదారు గదులు మినహా పూర్తయ్యాయని చెబుతున్న 212 భవనాలు కూడా అసంపూర్తిగానే ఉండిపోయాయి. మరో 43 భవనాలు ఇంకా ఫినిషింగ్ దశలోనే ఉండగా, మరో 33 భవనాలు ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్ దశల్లోనే ఉండిపోయాయి. పైకప్పు వేసినవి 36, వేయాల్సిన  దశలో 6, బేస్‌మెంట్ లెవల్‌లోనే మరో 8 స్కూళ్లు ఉన్నాయి.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top