
సాక్షి, అమరావతి: విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తికి మరో నెల గడువు కావాలని కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ కేంద్రాన్ని కోరింది. నగరంలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కనకదుర్గ ఫ్లై ఓవర్ పూర్తికి గడువును ఇప్పటికే కేంద్రం రెండు సార్లు పొడిగించింది. గతేడాది డిసెంబర్ ఆఖరుకు పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థకు నోటీసులిచ్చినా జాప్యం చేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెంత సమయం పడుతుందో నివేదిక పంపాలని ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులను మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ ఆదేశించింది.
భవానీ దీక్షల విరమణ, దసరా పండగ సీజన్‌లో పనులు ముందుకు సాగలేదని, అందువల్లే జాప్యం జరిగిందని కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. 90 శాతం పనులు పూర్తి అయ్యాయని, మరో నెలలో ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ చెబుతోందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కేంద్రానికి నివేదిక పంపించారు. కాగా, కృష్ణలంక నుంచి భవానీపురం వరకు 5.290 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు 2015లో టెండర్లు పిలవగా.. రూ. 307.58 కోట్లతో సోమా కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది.
2016 డిసెంబర్‌లోగా ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకుని ఆర్థిక ఇబ్బందులు పేరుతో మూడేళ్లకు పైగా పనుల్ని సాగదీస్తూ వచ్చింది. గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. రహదారులు, భవనాల సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పనులపై ఆరా తీశారు. త్వరిగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు.