జన్మభూమి సభకు వెళ్తూ మృత్యువాత

Constable Died in Bike Accident Chittoor - Sakshi

విధి నిర్వహణలో విషాదం

బైక్‌ను తప్పించబోయి చెట్టును ఢీకొన్న హైవే పట్రోలింగ్‌ వాహనం

కానిస్టేబుల్‌ మృతి, ఎస్‌ఐతోపాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలు

జన్మభూమి గ్రామసభ ముగించుకుని స్వగ్రామానికి వెళ్తున్న ప్రభుత్వోద్యోగి, కల్లూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన మరచిపోక మునుపే మళ్లీ మరో ఉదంతం చోటుచేసుకుంది. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ పర్యాయం జన్మభూమి గ్రామసభకు వెళ్తూ  కానిస్టేబుల్‌ ఒకరు మృత్యువాత పడ్డారు. ఎస్‌ఐతోపాటు మరో ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

పూతలపట్టు: పులిచెర్ల మండలంలోని కేకే పేటలో బుధవారం జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి పోలీసులు హాజరు కావాలని మంగళవారం ఉన్నతాధికారులు ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్‌ను ఆదేశించారు. గతంలో ఆ గ్రామంలో గొడవలు జరిగిన నేపథ్యంలో ఈ పర్యాయం గ్రామసభలో పునరావృ తం కాకుండా చూడాలని, ఉదయం 9 గంటలకంతా అక్కడికి చేరుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటలకు పూతలపట్టు నుంచి హైవే పట్రోలింగ్‌æ వాహనంలో హెడ్‌కానిస్టేబుళ్లు మునిరత్నం, ధనశేఖర్‌ నాయుడు, కానిస్టేబుళ్లు అశోక్, కృష్ణమూర్తితో ఎస్‌ఐ బయలుదేరారు. పది నిమిషాల వ్యవధిలోనే ప్రమాదానికి గురయ్యారు. తలపులపల్లె వద్ద ఎదురుగా వస్తున్న మోటార్‌ సైకిల్‌ను తప్పించే యత్నంలో డ్రైవింగ్‌ చేస్తున్న అశోక్‌ రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీకొన్నాడు. ఈ దుర్ఘటనలో అశోక్‌(32) అక్కడికక్కడే చనిపోగా ఎస్‌ఐకు తీవ్ర గాయాలయ్యాయి. హెడ్‌కానిస్టేబు ళ్లకు గాయాలయ్యాయి. పోలీసు వాహనం ప్రమాదానికి గురవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలకు పూనుకున్నారు. అశోక్‌ భౌతికకాయాన్ని, గాయపడిన పోలీసులను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెనుమూరు ఎస్‌ఐ వంశీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆసుపత్రిలో మిన్నంటిన ఆర్తనాదాలు
చిత్తూరు అర్బన్‌: పూతలపట్టు ప్రమాద ఘటన నేపథ్యంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి మృతుని కుటుంబ సభ్యుల రోదనలతో మార్మోగింది. ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే ఘటనా స్థలానికి నాలుగు అంబులెన్సులు చేరుకున్నాయి. పేటమిట్ట క్రాస్‌ నుంచి క్షతగాత్రులను అంబులెన్సుల్లో తీసుకొస్తుండగా చిత్తూరు సమీపంలోని చక్కెర ఫ్యాక్టరీ వద్ద రైల్వేగేటు వేసి ఉండడంతో కాస్త ఆందోళన నెలకొంది. అయితే అదే సమయంలో రైలు వెళ్లిపోవడంతో గేటు తెరిచారు. అంతే! శరవేగంతో అంబులెన్సులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరాయి.

ఎస్పీ, ఏఎస్పీ, ఇతర అధికారుల పరామర్శ
ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్, ఏఎస్పీలు సుప్రజ, కృష్ణార్జునరావు, ఇతర పోలీసు అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. డీఎస్పీ రామాంజనేయులు, సుబ్బారావు, గిరిధర్, సీఐ ఆదినారాయణ, వెంకటకుమార్‌ తదితరులు బాధితులకు దగ్గరుండి వైద్యసేవలు అందేలా చూశారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఎస్‌ఐతోపాటు హెడ్‌కానిస్టేబుల్‌ మునిరత్నం, కానిస్టేబుల్‌ ధనశేఖర్‌నాయుడును వేలూరు సీఎంసీకి తరలించారు. చికిత్సతో వారికి ప్రాణాపాయం తప్పినట్లు అక్కడి వైద్యులు చెప్పారని పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే, మృతుడి కుటుంబ సభ్యులు, బాధితులను ఓదార్చి ఎస్పీ ఆర్థికసాయం అందచేశారు.  ఆస్పత్రి వద్ద మృతుడు అశోక్‌కుమార్‌ భార్య శిల్ప, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తుండటం అందరినీ కలచివేసింది. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
యాదమరి : పూతలపట్టు మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ అశోక్‌కుమార్‌కు స్వస్థలమైన పెరుమాళ్లపల్లెలో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో  నిర్వహించారు. ఇంటి వద్ద మృతదేహానికి పలువురు నివాళులు అర్పించారు. శ్మశాన వాటికలో సీఐలు శ్రీనివాసులు, హరినాథ్, ఆదినారాయణ, ఎస్‌ఐలు సునీల్‌ కుమార్, వంశీ, మనోహర్, ఏఆర్‌ పోలీసులు  గాలిలో మూడు రౌండ్ల కాల్పుల (గార్డ్‌ ఆఫ్‌ హానర్‌)  అనంతరం దహనక్రియలు నిర్వహించారు.

మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం
మృతుని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మంత్రి అమరనా«థరెడ్డి, ఎస్పీ, ఎం ఎల్‌సీ దొరబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ, మృతుని భార్యకు ప్రభు త్వ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు.  వారి వెంట డీఎస్పీ రామాంజనేయులు, సీఐలు, ఎస్‌ఐలు,  మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఉన్నారు.

కానిస్టేబుల్‌ మృతికి ఎమ్మెల్యే సంతాపం
కాణిపాకం: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పూతలపట్టు  కానిస్టేబుల్‌ అశోక్‌ కుమార్‌ మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్, మునిరత్నం, ధనశేఖర్‌ నాయుడు  త్వరగా కోలుకో వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.  ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు పూర్తి స్థాయి సిబ్బందిని మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సిబ్బంది ప్రమాదాల బారిన పడితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top