రాజ్యసభలో పోలవరం బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ సవరణ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు.
రాజ్యసభలో పోలవరం బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టిన ఈ బిల్లును లోక్సభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ సవరణ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మొదటినుంచి జరిగిన విషయాలతో పాటు ఒడిషా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు దీనికి అడ్డుపడుతున్న వైనాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
కాగా, పోలవరంపై తీర్మానం, బిల్లు రెండింటిమీదా కలిపి ఒకేసారి చర్చ జరుగుతుందని, ఓటింగ్ మాత్రం విడివిడిగా తీర్మానానికి, బిల్లుకు రెండు సార్లుగా జరుగుతుందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ తెలిపారు. బిల్లు, తీర్మానం విషయమై టీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు ఆవేశంగా ప్రసంగించిన తర్వాత, సుజనా చౌదరికి ఆయనకు మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత కురియన్ ఈ విషయం తెలిపారు. అలాగే, ఇక ఇందులో రాజకీయ కోణం చూద్దామంటూ తీర్మానం విషయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అయితే తప్ప అధ్యక్ష స్థానంలో ఉన్నవారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆ తర్వాత జైరాం రమేష్కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా, ఈలోపు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తదితరులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇంతలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ లేచి.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తలపెట్టిన సవరణలను చదివి వినిపించారు. మళ్లీ వీహెచ్ లేచి నినాదాలు చేయబోగా కురియన్ మాత్రం జైరాం రమేష్కే అవకాశం ఇచ్చారు.