అధికార పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి విమర్శలు రావు.
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: అధికార పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి విమర్శలు రావు. జిల్లా యంత్రాంగానికి రాజకీయ ‘సంకెళ్లు’ తెగిపోయాయి. పరిపాలనంతా ఒకే ఒక్కడి చేతుల్లోకి వెళ్లింది. ఎన్నికల కోడ్ వచ్చేవరకు సొంత నిర్ణయాలతో ప్రకాశం జిల్లాను మరింత ప్రకాశవంతం చేసే అరుదైన అవకాశం కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్‌కు దక్కింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కలెక్టర్‌కు అందివచ్చింది. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతో ప్రస్తుత తరానికి చెందినవారు ఆ పాలన ఏవిధంగా ఉంటుందో తెలుసుకునే అవకాశం వచ్చింది.
రాష్ట్రపతి పాలనలో జిల్లాకు సంబంధించి సర్వాధికారాలు కలెక్టర్‌కు ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా, సంక్షేమ పథకాలు ప్రారంభించాలన్నా ఆయనే నిర్ణయం తీసుకోనున్నారు. క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను పర్యవేక్షించే వెసులుబాటు కలగనుంది. ప్రభుత్వాలు ఉన్న సమయంలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుంది. తమ అనుయాయులకు పథకాలను కట్టబెట్టేందుకు జిల్లా యంత్రాంగంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తుంటాయి. ఇకనుంచి అలాంటి ఒత్తిళ్లకు బ్రేక్‌లు పడనున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా స్వతంత్రంగా లబ్ధిదారులను ఎంపిక చేసుకునే, పార్టీలకు అతీతంగా పథకాలను అర్హులైన వారికి చేరువ చేసే అవకాశం అందివచ్చింది.
ఆ ఇద్దరికే జవాబుదారీ..
రాష్ట్రపతి పాలన రావడంతో కలెక్టర్ ఇక ఇద్దరికి మాత్రమే తాను చేపడుతున్న కార్యక్రమాల గురించి నివేదికలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్‌కు కలెక్టర్ నివేదికలు పంపుతారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల కోడ్ రానుంది. అంతకు ముందుగానే కలెక్టర్‌కు పాలనా పరంగా పూర్తి స్థాయిలో స్వేచ్ఛ రావడం వల్ల ఆయనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావుండదు. శాంతిభద్రతలపై కఠినంగా వ్యవహరించే వెసులుబాటు కూడా కలిగింది. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవు. రాష్ట్రపతి పాలన ఉన్నంతకాలం కలెక్టర్ అన్నీ తానై వ్యవహరించనున్నారు.