ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండాలి

CM YS Jaganmohan Reddy Conducts Review Meeting On Covid-19 Prevention - Sakshi

ప్రజలకు తగినన్ని రైతుబజార్లు, నిత్యావసరాలుండాలి

సరిపడా ఉన్నాయో లేదో శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్‌ చేయాలి 

ఆ తర్వాతే లాక్‌డౌన్‌ సడలింపు సమయం తగ్గింపుపై నిర్ణయం

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లోనే ప్రత్యేక క్యాంప్‌లు

వారి బాగోగులు చూసేందుకు ప్రత్యేకంగా ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు

సమన్వయం కోసం ప్రతి క్యాంప్‌ వద్ద ఓ రెసిడెంట్‌ అధికారి

సరిహద్దుల్లోని మండపాలు, హోటళ్లను శానిటైజ్‌ చేసి అందుబాటులోకి తేవాలి

విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి ఒక డాక్టర్‌.. వీరిపై ఓ స్పెషలిస్ట్‌ పర్యవేక్షణ

సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష 

సరుకులు, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ రంగాలకు చెందిన వాహనాలను నిలిపేస్తున్నారంటూ సమాచారం వస్తోంది. దీనిపై వెంటనే డీజీపీ దృష్టి పెట్టి, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి పర్యవేక్షణలో ఉన్న ప్రతి 10 మందికీ ఒక డాక్టర్‌ను కేటాయించాలి. వీరిని  పల్మనాలజిస్ట్‌ పర్యవేక్షించాలి. వీరి పని సాఫీగా సాగేందుకు, అనువైన సలహాలు, సూచనలు, వైద్య ప్రక్రియలపై అవగాహనకు డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలి. 

ప్రతి 50 ఇళ్లకు చెందిన ప్రజల పరిస్థితులను ఎప్పటికప్పుడు వలంటీర్లు నమోదు చేసే విధానాన్ని నిరంతరం కొనసాగించాలి. వలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యులకు వైరస్‌ సోకకుండా ప్రొటెక్షన్‌ సూట్లు, పరికరాలు అందించాలి. కరోనా కేసుల టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచడంపైన కూడా దృష్టి పెట్టాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ప్రజలకు సరిపడా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు తొలుత అందుబాటులోకి తేవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవి ప్రజల సంఖ్యకు తగినట్లుగా ఉన్నాయా లేదా అనే దానిపై శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. ఆ తర్వాత సంతృప్తి చెందితేనే లాక్‌డౌన్‌ సడలింపు సమయం తగ్గించడంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న తీరు, దాని నివారణ కోసం అందుబాటులో ఉన్న వైద్య విధానాలు, డేటా విశ్లేషణ ద్వారా చేపట్టాల్సిన ప్రణాళికపై సమావేశంలో సీఎం విస్తృతంగా చర్చించారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, అమలవుతుండటం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ముఖ్యమంత్రికి వివరించారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న సమయాన్ని తగ్గించాలనే అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. అనంతరం సీఎం పలు ఆదేశాలు, సూచనలు చేశారు. 

హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం వైద్యం
– జిల్లాల్లో కోవిడ్‌–19 నివారణ చర్యల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే డాక్టర్లను గుర్తించి వారి సేవలను తీసుకోవాలి. 
– తమ సర్వే ద్వారా వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు గుర్తించిన వారిని డాక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి... నిర్దేశించుకున్న హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం వారికి వైద్యం అందించాలి. 
– విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కరోనా వైరస్‌ విస్తరించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత పటిష్టంగా నివారణా చర్యలు చేపట్టాలి. ఇదే సమయంలో ప్రజలకు నిత్యావసరాలు, తాగు నీరు, మందులు, పారిశుధ్యం తదితర ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలి.
లాక్‌డౌన్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

పట్టణ ప్రాంతాలపై మరింత దృష్టి
– దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులకు సంబంధించి 10 కేసుల్లో 9 పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 1 కేసు లెక్కన నమోదవుతున్నాయని, అందుకే పట్టణ ప్రాంతాలపై మరింత దృష్టి సారిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా వీలైనంత ఎక్కవ మంది వైద్యులు, సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావడంపై చర్చ. హౌస్‌ సర్జన్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం.
– వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆక్వాకు సంబంధించి కరోనా కారణంగా ఉత్పన్నమైన  సమస్యలను పరిష్కరించడంపై సంబధిత అధికారులు దృష్టి సారించాలని సీఎం ఆదేశం. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేసుకునే వారికి అవకాశం కల్పించాలని సూచన.
– ఎవరికి కరోనా లక్షణాలు కనిపించినా ఐసోలేషన్‌లో పెట్టాలని గట్టి నిర్ణయం. 
– ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గూడ్స్, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ రంగాలకు చెందిన వాహనాలను నిలిపేస్తున్నారంటూ సమాచారం వస్తోంది. దీనిపై వెంటనే డీజీపీ దృష్టి పెట్టి, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. 

విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి పర్యవేక్షణలో ఉన్న ప్రతి 10 మందికీ ఒక డాక్టర్‌ను కేటాయించాలి. వీరిని  పల్మనాలజిస్ట్‌ పర్యవేక్షించాలి. వీరి పని సాఫీగా సాగేందుకు, అనువైన సలహాలు, సూచనలు, వైద్య ప్రక్రియలపై అవగాహనకు డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలి.

ఏర్పాట్లు బాగుండాలి..
- కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వారి బాగోగులు చూసుకుంటాయి. అయినా పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి చెందిన కొందరు కూలీలు, కార్మికులు తరలి వస్తే సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మాట్లాడాలి.
- సరిహద్దుల వద్దకు వచ్చి ఆగిపోయిన వారు 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే రాష్ట్రంలోకి అనుమతివ్వాలి. అక్కడ ఉన్న మన ప్రజలకు వసతి, భోజనం అందేలా చూడాలి. 
- పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రజల బాగోగులను చూసేందుకు, ఆయా రాష్ట్రాల అధికారులు, ప్రధాన కార్యదర్శులతో సమన్వయం చేయడానికి, రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన వారి బాగోగులు (ఏర్పాట్లు, క్వారంటైన్‌ సదుపాయాలు) చూసుకోవడానికి ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు సతీష్‌ చంద్ర, పీయూష్‌ కుమార్‌ల నియామకం. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రతి క్యాంపునకూ ఒక రెసిడెంట్‌ అధికారిని నియమించాలి. ఏర్పాట్లు బాగోలేవు అనే మాట రాకూడదు.  
- సరిహద్దుల్లో ఉన్న కళ్యాణ మండపాలు, హోటళ్లు తదితర వాటిని గుర్తించి, శానిటైజ్‌ చేసి అందుబాటులోకి తీసుకురావాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top