
సాక్షి, అమరావతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(కోవిడ్ -19) ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను సైతం భయపెడుతోంది. తాజాగా తెలంగాణలో కరోనాను కట్టడి కోసం విద్యాసంస్థలు బంద్ చేయడంతో అటు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి నివారణపై ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎస్ నీలం సాహ్ని, ఆళ్ల నాని, వైద్యశాఖ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్న సీఎం జగన్.. వాటిపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షిస్తున్నారు.
కాగా, కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఆందోళనకర పరిస్థితి లేదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 70 అనుమానిత కేసులు నమోదు కాగా..57 కేసులకు సంబంధించిన పరీక్షల్లో కరోనా లేనట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. మరో 12 నమూనాలకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందని.. ఒక కేసు మాత్రమే పాజిటివ్‌గా నమోదైందని వెల్లడించింది.