అభివృద్ధి పనులపై సీఎం ఆరా

CM YS Jagan Mohan Reddy Inquires on Devolopment Works Kadapa - Sakshi

కడప విమానాశ్రయంలో కాసేపు ఆగిన ముఖ్యమంత్రి

ఆయనతో భేటీ అయిన జిల్లా కలెక్టర్‌

ఈనెలలో చేపట్టే అభివృద్ధి పనులపై చర్చ

పెండింగ్‌ జీఓల విడుదలకు జగన్‌ తక్షణ ఆదేశాలు

సాక్షి ప్రతినిధి కడప: జిల్లాలో అభివృద్ధి పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈనెలలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి్ద పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కడప స్టీలు ప్లాంటు,కుందూ– తెలుగుగంగ ఎత్తిపోతల పథకంతోపాటు పలు పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వ్యక్తిగత సహాయకుడు నారాయణ మృతి నేపథ్యంలో అనంతపురం జిల్లా వెళ్లేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం కడప విమానాశ్రయంలో దిగారు. ఈసందర్భంగా  జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ కలుసుకున్నారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ఈనెల 23,24,25 తేదీల్లో జిల్లాలో చేపట్టనున్న  శంకుస్థాపనలకు సంబంధించి ఏర్పాట్లు  చేయాలని సీఎం  ఆదేశించారు.  ప్రధానంగా మెడికల్‌ అండ్‌ హెల్త్,భారీ నీటిపారుదలశాఖ, రోడ్లు భవనాలశాఖ, ఏపీ టూరిజం విభాగంతో పాటు పలు శాఖలకు సంబంధించి 15 జీఓలు విడుదల కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని కలెక్టర్‌ సీఎం దృష్టికి తెచ్చారు. జీఓలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు. జిల్లాలో చేపట్టే అభివృద్ధి్ద పనులపై వారంలోగా విజయవాడలో సమీక్ష నిర్వహిద్దామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. పులివెందుల అభివృద్ధి్ద పనులపై  అక్కడిప్రత్యేక అధికారితో చర్చించి ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.  పనులు సకాలంలో జరిగేలా చూడాలని ఆయన కలెక్టరుకు సూచించినట్లు తెలుస్తోంది. 

అనంతపురం జిల్లాకు వెళ్లిన సీఎం
కడప రూరల్‌: ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు  కడప విమానాశ్రయంలో దిగారు. ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి కూడా వెంట వచ్చారు. విమానాశ్రయంలో సీఎంకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, డా. సుధీర్‌రెడ్డి,డా. వెంకటసుబ్బయ్య, వైఎస్‌ఆర్‌సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె. సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కొద్దిసేపు అధికారులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. మధ్యాహ్నం 3.29 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం అనంతపురం జిల్లాకు బయలుదేరారు. అక్కడ  వ్యక్తిగత సహాయకుడు నారాయణ మృతదేహాన్ని సందర్శించాక తిరిగి  4.39 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. 4.45 గంటలకు విజయవాడ బయలుదేరి వెళ్లారు.  కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాసీమ బాబు, గుమ్మా రాజేంద్రప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top