చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ సవాల్‌

CM YS Jagan Dares Chandrababu on Farm Loans - Sakshi

సాక్షి, అమరావతి: రైతులకు వడ్డీ లేని రుణాలకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల కష్టాలపై చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. 2014-19 వరకు రైతులకు సున్నా వడ్డీ కింద చంద్రబాబు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు పదే పదే అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. రికార్డులు తెప్పించి చూద్దామని, సున్నా వడ్డీకి డబ్బులు ఇవ్వలేదని రుజువుతై చంద్రబాబు రాజీనామా వెళ్లిపోతారా అని సీఎం జగన్‌ సవాల్‌ విసిరారు. చంద్రబాబు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని, సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

రైతులకు సున్నా వడ్డీకి రుణాల పథకం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే మొదలుపెట్టారని, దాన్ని కొనసాగిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అనడంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారని గుర్తు చేశారు. టీడీపీ సభ్యుడు చెప్పినట్టుగా ఈ పథకం రద్దు కాకుంటే 2014 నుంచి సున్నా వడ్డీ పథకాన్ని ఎన్ని డబ్బులు కేటాయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులకు మేలు చేసేందుకు మంచి మనసుతో ‘వైఎస్సార్‌ రైతుభరోసా’ పేరుతో కొత్తగా రైతులకు సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చామని చెప్పారు. దీనికి తమను అభినందించాల్సింది పోయి దారుణంగా మాట్లాడతారా ముఖ్యమంత్రి జగన్‌ అని ప్రశ్నించారు.

2018-19 కాలానికి గతేడాది రూ. 76,721 కోట్లు పంట రుణాలుగా ఇచ్చారని, దీనికి రూ.3,068 కోట్లు వడ్డీగా చెల్లించాలన్నారు. ఈ ఐదేళ్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారుగానీ చెల్లింపులు జరగలేదన్నారు. ఐదేళ్లలో వడ్డీ రూ.15 వేల కోట్లు దాటిందని, వడ్డీనే 15 వేల కోట్లు దాటితే రుణమాఫీగా గత ప్రభుత్వం ఇచ్చిందేమిటని ప్రశ్నించారు. ఇవి చెల్లించకుండా దానికే రుణమాఫీ అని పేరు పెట్టి మోసం చేశారని దుయ్యబట్టారు. ఇలా మోసం చేశారు కాబట్టి చంద్రబాబు ప్రతిపక్ష స్థానానికి మారారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ సవాల్‌కు చంద్రబాబు సూటిగా సమాధానం ఇవ్వకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ‘నన్ను సమాధానం చెప్పమనడం ఏంటి? నన్ను రాజీనామా చేయమనడమేంటి?, సున్నా వడ్డీకి నిధులు ఇచ్చానని నేను అనలేదు. దీనికి నన్ను జవాబు చెప్పమనడమేంటి?’ అంటూ చంద్రబాబు ఒంటికాలిపై లేచారు. సున్నా వడ్డీకి నిధులు ఇచ్చారో, లేదో చంద్రబాబు చెప్పాలని అధికారపక్ష సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. పలువురు సభ్యులు మాట్లాడిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. (చదవండి: దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు: సీఎం జగన్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top