
సాక్షి, అమరావతి: ప్రభుత్వం జరిపే కొనుగోళ్లకు అత్యంత పారదర్శకమైన, అవినీతికి తావులేని విధానం అవలంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు ఏయే మార్గదర్శకాలు పెట్టాలో సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రూ.కోటి పైబడి ఏ కొనుగోళ్లు జరిపినా ఏపీ వెబ్‌సైట్‌లో పెట్టాలని, మన ప్రొక్యూర్‌మెంట్ విధానం దేశానికి ఆదర్శం కావాలని సీఎం అన్నారు. ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నామో వారి వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టాలని, అంతకంటే తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చే వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించారు.
కుంభకోణాలకు ఏమాత్రం ఆస్కారం ఉండరాదని నొక్కి చెప్పారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఏదీ స్కామ్‌లకు అనర్హం కాదన్నట్లుగా ప్రతిదానిలో కుంభకోణాలు రాజ్యమేలాయి. ట్రాక్టర్లు, ఆటోలు, కార్ల కొనుగోలు, యూనిఫారాలు, స్కూలు పుస్తకాలు, కోడిగుడ్లు, స్కూలు విద్యార్థులకు పంపిణీ చేసే షూలు.. ఇలా అన్నింటా కుంభకోణాలు సాగాయి. ఈ వ్యవస్థను ఇకనైనా శుద్ధి చేయాల్సిన అవవసరం ఎంతైనా ఉంది. అన్నింటికంటే మన ప్రభుత్వం విభిన్నం అని చూపాలి. మనకు తెలియకుండానే చాలా జరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటికి కచ్చితంగా మనం అడ్డుకట్ట వేయాలి. ఇందుకు అధికారులు ఆలోచించి ఒక పరిష్కారాన్ని చూపాలి’ అని సూచించారు.
టెండర్ల ద్వారానే కొనుగోలు
ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రొక్యూర్‌మెంట్ (సేకరణ –కొనుగోలు) విధానాన్ని సీఎం వైఎస్ జగన్ సమీక్షిస్తూ.. ఏమి కొనుగోలు చేయాలన్నా టెండర్లు ఆహ్వానించాలని చెప్పారు. ఇందులో ఎవరు తక్కువకు కోట్ చేశారో వారి పేరును, ధరను వెబ్‌సైట్‌లో పెట్టి రివర్స్ టెండరింగ్ కోసం కొంత సమయం ఇవ్వాలన్నారు. నిర్ధిష్ట గడువులోగా ఈ ధర కంటే తక్కువకు సరఫరా చేసేందుకు ముందుకొచ్చి కోట్ చేస్తే వారికే అవకాశం ఇవ్వాలని సూచించారు.
కొనుగోళ్లలో అమలు చేస్తున్న ఉత్తమ పారదర్శక విధానాలపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా సీఎం మార్గనిర్దేశం చేశారు. ఇలా చేయడం ద్వారా వ్యవస్థలో స్వచ్ఛత తేవచ్చని చెబుతూ.. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి ఈనెల 28వ తేదీన మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.