తప్పుచేస్తే వదలొద్దు

 CM Take Action Without Any Involvement Of Parties - Sakshi

సాక్షి, చిత్తూరు : ఊరు బాగుంటే జనం బాగుంటారు.. జనం బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకే సామాన్యుల ప్రశాంత జీవనానికి ఎక్కడా విఘాతం కలగకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం అమరావతిలో కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. తప్పుచేస్తే పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోమన్న సీఎం మద్యంపై యుద్ధం ప్రకటించారు. పోలీస్‌ స్టేషన్లలో జవాబుదారీతనం ఉండాలన్నారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే..

స్టేషన్లలో రిసెప్షన్‌ కేంద్రాలు
న్యాయం కోసం సామాన్యుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటేనే ఓ రకమైన భయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. ఇలాంటి వారికి పోలీసుల పట్ల గౌరవం కలిగించాలంటే ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. అందుకే ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎస్పీలను సీఎం ఆదేశించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుకూ రశీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారమయ్యే వరకు కిందిస్థాయి సిబ్బంది దానిపై ఆరా తీస్తుండాలి. తద్వారా అధికారుల్లో బాధ్యత పెరగడమేగాక ఫిర్యాదుదారుల పట్ల గౌరవంతో ఉంటారు.

మద్యంపై యుద్ధం
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లే రానున్న ఐదేళ్లలో మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామని చెప్పడంతో ఆ దిశగా సీఎం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా అక్టోబర్‌ ఒకటో తేదీకి జిల్లాలో ఎక్కడా బెల్టు దుకాణాలు ఉండకూదన్నారు. గాంధీ జయంతి రోజున బెల్టు దుకాణాలకు మంగళం పాడాలన్నారు. దీంతో జిల్లాలో టీడీపీ నేతలకు ఉపాధి కేంద్రాలుగా ఉన్న 5వేలకు పైగా దుకాణా లపై ఎక్సైజ్, పోలీసు శాఖ సంయుక్తంగా దాడులు చేయనున్నాయి. ఇక రహదారుల వెంబడి మద్యం దుకాణాలు వద్దని కూడా సూచించారు. ఈ లెక్కన జిల్లాలోని జాతీయ రహదారులపై 500 మీటర్ల లోపున్న 148 మద్యం దుకాణాలు, రాష్ట్ర రహదారులపై 220 మీటర్లలోపున్న 178 మద్యం దుకాణాలు, ఈ రెండు రోడ్లపై ఉన్న 9 బార్లు కనుమరుగవనున్నాయి. దీనికితోడు దాబాల్లో మద్యం లభిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి. 

‘హోదా’ ఉద్యమకారులపై కేసుల ఉపసంహరణ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదంతో గత ఐదేళ్లలో పోరాటం చేసిన వారిపై నమోదైన కేసులను ఎత్తేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల్లో ప్రత్యేక హోదా ఉద్యమాలు జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారు. హోదా పేరెత్తితే జైల్లో పెట్టడంటూ ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఐదేళ్ల కాలంలో ఉద్యమకారులతో పాటు ప్రజలకు అండగా నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలపైనా కేసులు బనాయించారు. తాజాగా వైఎస్‌.జగన్‌ నిర్ణయంతో జిల్లాలో నమోదైన ప్రత్యేక హోదా కేసులు మాఫీ కానున్నాయి.

సైబర్‌ క్రైంపై
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి. జిల్లాలో రోజుకు 30 మంది మహిళలు బాధితులుగా ఉంటే స్టేషన్లలో నెలకు రెండు కేసులు నమోదవడం కష్టతరంగా ఉంది. దీనికి ప్రధాన కారణం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను పట్టుకోలేకపోవడమే. దీనిపైనా సీఎం స్పందించారు. విదేశాల్లో ఉపయోగించే సాంకేతిక విధానాన్ని ఇక్కడ వాడాలని, మహిళలపై ఆన్‌లైన్‌ వేదికల్లో జరుగుతున్న వేధింపులను అరికడుతూ నిందితులను చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ నివారణ, ఆన్‌లైన్‌ మోసాలపై ఎస్పీలు చొరవ చూపాలని చెప్పడం మహిళలకు రక్షణగా నిలవడమే అవుతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top