
సాక్షి, విజయవాడ: కర్ణాటక ఎన్నికల తర్వాత మనకు చుక్కలు చూపిస్తారని ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడని, అయితే మనకు ఎవరూ చుక్కలు చూపించలేరని, తెలుగు జాతి తిరుగుబాటు చేస్తే కేంద్రమే గజగజలాడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ విద్యాధరపురంలో రూ.80 కోట్లతో నిర్మిస్తున్న హజ్‌హౌస్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ముస్లింలంతా అండగా ఉండాలని, ఇది తన కోసం కాదని భావితరాల కోసమన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీశామని చెప్పారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వమే ఖర్చులు ఇస్తుందన్నారు. హజ్‌యాత్రపై 18 శాతం జీఎస్టీ విధించడం బాధాకరమన్నారు. విజయవాడలో హజ్ హౌస్ కడుతున్నామని.. ఇక్కడే షాదీఖానా, మసీదు, వక్ఫ్ బోర్డ్ కార్యాలయం ఉంటాయన్నారు.