క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున క్రైస్తవులకు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఘనంగా హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కర్నూలు అగ్రికల్చర్ : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున క్రైస్తవులకు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఘనంగా హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు చర్చిల పాస్టర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయమోహన్ కేక్‌ను కట్ చేశారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని క్యాండిలైటింగ్ కార్యక్రమం నిర్వహించారు. క్రీస్తు పాటలను ఆలపిస్తూ యువకులు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
క్రిస్మస్ తాత వేషధారణలతో పలువురు చిన్నారులు ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యేసు జన్మదినం ప్రపంచ దేశాలకే పండుగ వంటిదని ఆయన రాకతోనే సర్వమానవాళికి ముక్తిమార్గమన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటున్న క్రైస్తవులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చర్చి పాస్టర్లు మాట్లాడుతూ మానవజాతిని వెలుగులోకి నడిపించే పండుగే క్రిస్మస్ అంటూ పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ చర్చిల పాస్టర్లు, పలువురు క్రైస్తవులు, ముస్లిం మైనార్టీ ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.