చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో గురువారం బాంబు పేలింది.
* జడ్జీల ప్రొటోకాల్ వాహనం కింద పేలిన బాంబు
* న్యాయవాది గుమస్తాకు తీవ్రగాయాలు
* చింటూ కోర్టు బయటకు వెళ్లగానే పేలుడు
* సంఘటనపై ఆరా తీసిన ఏపీ ముఖ్యమంత్రి
చిత్తూరు(అర్బన్): చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో గురువారం బాంబు పేలింది. మధ్యాహ్నం 12.03 గంటల సమయంలో జిల్లా, సెషన్స్ కోర్టు ఎదుట ఉన్న వాహనాల పార్కింగ్ షెడ్డులో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో న్యాయవాది గుమస్తాగా పని చేస్తున్న బాలాజీ(54) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో బాలాజీ కాలికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు అతడి పాదం పూర్తిగా తొలగించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు చిత్తూరు వచ్చే సందర్భాల్లో వారి సేవల కోసం వినియోగించే ప్రొటోకాల్ వాహనం(బొలేరో) కింద గంధకం(ఫాస్ఫరస్) పొడికి, బ్యాటరీ అమర్చిన దుండగులు రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చారు. పేలుడు జరిగినప్పుడు కోర్టు ఆవరణలో వందల సంఖ్యలో కక్షిదారులు, పోలీసులు, న్యాయవాదులు ఉన్నారు. బాంబు పేలుడు నేపథ్యంలో న్యాయస్థానాల సముదాయంలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. పేలుడుకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు.
చింటూయే లక్ష్యమా?: 2007లో చిత్తూరులోని పలమనేరు రోడ్డులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటనపై ఇదే కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కటారి మోహన్, రెండో నిందితుడు చింటూ. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చింటూను సీకే బాబుపై హత్యాయత్నం కేసులో విచారణ నిమిత్తం గురువారం పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 22కు వాయిదా వేశారు.
చింటూను పోలీసులు మధ్యాహ్నం 11.55 గంటల సమయంలో న్యాయస్థానాల సముదాయం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 8 నిమిషాలకే కోర్టులో బాంబు పేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు కోర్టులో జరిగిన పేలుడు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఆయన చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి, వివరాలను తెలుసుకున్నారు.