ముందు కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకోండి | The Chittoor Collector Urged the Farmers not to Commit Suicide | Sakshi
Sakshi News home page

ముందు కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకోండి

Jul 12 2019 10:08 AM | Updated on Jul 12 2019 10:08 AM

The Chittoor Collector Urged the Farmers not to Commit Suicide - Sakshi

మృతుడికి నివాళి అరిస్తున్న కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త

గంగవరం: అప్పులు తీర్చలేమన్న బాధతో రైతులు ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దని కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త పిలుపునిచ్చారు. అప్పుల బాధతో మండలంలోని పాత కీలపట్లలో రైతు విజయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై కలెక్టర్, మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి గురువారం మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. పుస్తకంలో మృతుడు రాసిన అప్పులను కలెక్టర్‌ పరిశీలించారు. అందులో రూ.4.97లక్షలు అప్పుల రూపంలో రాసినట్టు గమనించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్‌ ఆ కుటుంబానికి పరిహారంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.7లక్షలు ప్రభుత్వం నుంచి రెండు రోజుల్లో అందిస్తామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అలాగే మృతుడి కుమారుల చదువులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు తీసుకుని కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. 

ప్రభుత్వమే ఆదుకుంటుంది
మృతుడి కుటుంబ సభ్యులను కలిసి భరోసా ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు ఆత్మహత్య చేసుకునే ముందు వారి కుటుంబాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. రైతుల కున్న అప్పుల గురించి వ్యవసాయ శాఖ అధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతారని, తగిన సూచనలు, సలహాలు తెలియజేస్తారని చెప్పారు. 2014 వరకూ రైతుల ఆత్మహత్యలకు పాల్పడిన వారు జిల్లాలో 25 మంది ఉన్నారని వారిలో 13మందికి మాత్రమే పరిహారం అందిందన్నారు. మిగిలిన 12మందికి త్రీమెన్‌ కమిటీ రిపోర్టు ప్రకారం అందిస్తామని ఆయన తెలిపారు. వారి వెంట వ్యవసాయ శాఖ జేడీ విజయ్‌కుమార్, పోలీసు శాఖ అధికారులు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ మోహన్‌రెడ్డి, ప్రహ్లాద, గిరిరాజారెడ్డి, ఇతర నాయకులు, పలు శాఖల అధికారులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement