
కొనసాగుతున్న అరెస్టుల పరంపర
మేయర్ అనురాధ దంపతుల హత్య కేసు కొలిక్కి వస్తోంది. ప్రధాన నిందితుడు చింటూను విచారిస్తున్న పోలీసులు కేసులో పురోగతి సాధించా రు.
చింటూ డ్రైవర్ వెంకటేష్‌ను విచారిస్తున్న పోలీసులు
పది రోజుల పోలీసు కస్టడీకి యోగ, శశిధర్
టీడీపీ నేతలపై కేసు నమోదుకు రంగం సిద్ధం?
చిత్తూరు (అర్బన్): మేయర్ అనురాధ దంపతుల హత్య కేసు కొలిక్కి వస్తోంది. ప్రధాన నిందితుడు చింటూను విచారిస్తున్న పోలీసులు కేసులో పురోగతి సాధించా రు. పరారీలో ఉన్న చింటూ డ్రైవర్ వెంకటేష్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి వెంకటేష్ కోసం చిత్తూరు కోర్టు వద్ద పోలీసులు నిఘా ఉంచారు. అతన్ని కోర్టు వద్ద చూసిన మేయర్ అనుచరులు పట్టుకున్నారు. వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పరంధామ సోదరుల అరెస్టు
టూటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన ఐదుగురిలో ముగ్గురు పరంధామకు సోదరులు కావడం విశేషం. చింటూ మేయర్ కుటుంబంపై కసి పెం చుకోవడంలో పరంధామ పాత్ర కీలకం కావడం, అతన్ని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. పరంధామ సోదరుల్లో చింటూ విద్యాసంస్థల వ్యవహారా న్ని చూసుకుంటున్న వాసు, ఆర్థిక లావాదేవీలు చూసే గుణశేఖర్, ఇతర వ్యవహారాలు చక్కబెట్టే లక్ష్మీపతితో పాటు అనుచరులుగా ఉన్న అప్సర్, సతీష్‌ను తాజాగా అరెస్టు చేశారు. వీరిపై మారణాయుధాల నిరోధక చట్టం- 1959 కింద కేసులు నమోదు చేశారు. ఇక చింటూ అనుచరులని చెప్పుకోవడానికి బయట ఎవరూ లేకుండా పోలీసు లు అందరిపైనా కేసులు నమోదు చేసి దర్యాప్తులో పట్టు సాధించినట్లయ్యింది.
కస్టడీకి యోగ, శశిధర్
ఐదురోజుల క్రితం వెంకటాచలం, మంజునాథ్, జయప్రకాష్‌ను పది రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణలో పలు విషయాలను రాబ ట్టారు. ఈ క్రమంలో రిమాండులో ఉన్న యోగ, శశిధర్‌ను న్యాయస్థానం అనుమతితో వన్‌టౌన్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని పది రోజుల పాటు విచారించనున్నారు.
తెలుగు తమ్ముళ్లకు సంబంధం..?
మేయర్ హత్య కేసులో తెలుగు దేశం పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న చింటూతో పాటు బయటి వ్యక్తుల్ని విచారించడంతో ఈ విషయం బయట పడింది. మేయర్ దంపతుల హత్య కుట్ర ఇద్దరు తెలుగు దేశం నాయకులకు తెలిసినా పోలీసులకు విషయం చెప్పకుండా దాచేసినట్లు సమాచారం. దీంతో వీరిపై కేసులు నమోదు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు జిల్లా పార్టీలో ప్రధాన పదవిలో ఉండగా, మరో వ్యక్తి ఎర్రచందనం కేసుల్లో అరెస్టయిన నిందితుడిగా చెబుతున్నారు.
పుంగనూరులో పిస్టోలు స్వాధీనం
మేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూకు ఆశ్రయం కల్పించారనే సమాచారంతో గురువారం పుంగనూరులో స్థానిక పోలీసులు పలుచోట్ల సోదాలు నిర్వహించారు. నగరంలోని దండుపాళ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో పిస్టోలును స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల్లో పోలీసులు పుంగనూరులో ఇద్దరు న్యాయవాదులు సహా నలుగురిని అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించారు. తాజాగా ఓ వ్యక్తిని, పిస్టోలును స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సోదాల్లో పుంగనూరు సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ హరిప్రసాద్ పాల్గొన్నారు.