కావలిఅర్బన్: బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని, వాటిని అరికట్టేందుకు అందరూ కృషి చేయాలని ఆర్డీఓ ఇస్కా భక్తవత్సలరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రో చైల్డ్ గ్రూపు సహకారంతో జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరమ్ కావలి డివిజన్ ఇన్‌చార్జి వై గగన కుమారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిషేధ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఆర్డీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలతో అనర్థాలు జరుగుతాయన్నారు. బాలికలు మానసిక, శారీరక ఎదుగుదల ఆగిపోతుందన్నారు. 18 ఏళ్లు నిండిన తరువాతే బాలికలకు వివాహం చేయాలన్నారు.
బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అధికారుల అందరిపైనా ఉందన్నారు. గగన కుమారి మాట్లాడుతూ పురుషాధిక్యత, నిరక్షరాస్యత, పేదరికం, లైంగిక దాడులు బాల్య వివాహాలకు ప్రధాన కారణం అవుతున్నాయన్నారు. ఆడపిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కావలి ఏరియా వైద్యశాల మాజీ సూపరింటెండెంట్ మండవ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కృష్ణారావు, ఎన్డీసీఆర్‌ఎఫ్ సభ్యులు ఎం అబ్దుల్ అలీమ్, చాకలికొండ శారద, కావలి సీడీపీఓ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.