ఆశ్రమ విద్యార్థులకు కోడికూర!

Chicken Curry For Tribal Students In Ashram Schools - Sakshi

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఇకపై వారంలో రెండు రోజులు కోడికూర

జూన్‌ 12 నుంచి 47 ఆశ్రమ పాఠశాలల్లో అమలు

పక్కాగా మెనూ అందించేందుకు ఐటీడీఏ సన్నాహాలు 

సీతంపేట : గిరిజన విద్యార్థులకు సక్రమమైన మెనూ అందించి వారిలో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఐటీడీఏ సన్నాహాలు చేస్తోంది. గతేడాది ఆగస్టులో ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్‌ చొరవతో ఆశ్రమ పాఠశాలల విద్యార్థులందరికీ ప్రతి ఆదివారం చికెన్‌ కూర పెట్టేలా మెనూలో చేర్చారు. దీన్ని విద్యా సంవత్సరం ముగిసే వరకూ పక్కాగా అమలు చేశారు. ప్రతి విద్యార్థికీ వంద గ్రాముల చొప్పున చికెన్‌ కూర అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి వారంలో రెండు రోజు చికెన్‌ కూర పెట్టేలా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

సీతంపేట ఐటీడీఏ పరిధిలో సబ్‌ప్లాన్‌ మండలాలు 20 ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 14 వేల మంది గిరిజన విద్యార్థినీ విద్యార్థులు మూడు నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. పాఠశాలకు సరాసరి 250 నుంచి 650 మంది వరకు విద్యార్థులు ఉన్నారు.  వీరందరికీ చదువుతో పాటు రోజూ సరైన మెనూ అందించాలని అధికారులు నిర్ణయించారు. మిగతా ఐటీడీఏలకు భిన్నంగా కోడి కూరను వండిపెట్టారు. ఈ తరహా మెనూ సక్సెస్‌ కావడంతో వచ్చే విద్యాసంవత్సరంలో వారంలో రెండు సార్లు నెలకు 8 సార్లు కోడికూర ఆశ్రమ విద్యార్థులకు పెట్టనున్నారు. 

జూన్‌ 12 నుంచి అమలుకు సన్నాహాలు 
వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే కొత్త మెనూ అమలు చేసేలా పీవో శివశంకర్‌ చర్యలు చేపడుతున్నారు.  విద్యార్థుల్లో 150 మంది వరకు సికిల్‌ సెల్‌ ఎనిమియాతో బాధపడుతున్నారు. మరో 500 మంది వరకు రక్త హీనతతో ఉన్నారు. గతంలో వైద్యశాఖ సర్వేలో విద్యార్థుల్లో కొంతమంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని గుర్తించారు. ఐదువేల మంది వరకు రక్తహీనతతో బాధపడవచ్చుననేది అనధికారిక అంచనా. విద్యార్థుల్లో ఈ తరహా లోపాలను అధిగమించడానికి  రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా సీతంపేట ఐటీడీఏలో నెలనెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా వారంలో ఒక రోజు చికెన్‌ కూర పెట్టడానికి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలల్లో అమలౌతున్నది లేనిది తెలుసుకోవడానికి ఏకకాలంలో ఆకస్మికంగా తనిఖఈలు కూడా చేశారు. పక్కాగా అమలౌతుందని గుర్తించిన పీవో ఈసారి అన్ని ఆశ్రమపాఠశాలల్లో వారంలో రెండుసార్లు చికెన్‌ కూర పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. 

పక్కాగా అమలుకు చర్యలు 
నెలనెలా వెన్నెలా కార్యక్రమం అనేది వినూత్న పథకం. దీనిలో భాగంగా విద్యార్థులకు గతేడాది ఆగస్టు నుంచి కోడికూర వారంలో ఒక రోజు పెట్టడం జరిగింది. ఇప్పుడు వారంలో రెండురోజులు పెట్టడానికి గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ప్రతిపాదనలు పెట్టాం. ఇందుకు గిరిజన సంక్షేమశాఖ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తాం. 
– లోతేటి శివశంకర్, ఐటీడీఏ పీవో

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top