మద్యం షాపులో పనిచేస్తా.. నిషేధానికి కృషి చేస్తా

Chennekothapalli Woman Applied APSBCL Wine Shop Supervisor Post - Sakshi

సాక్షి, చెన్నేకొత్తపల్లి: అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం వెంకటంపల్లికి చెందిన ఈమె పేరు వన్నా స్వప్న. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. తానూ ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తానంటూ సూపర్‌వైజర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. భర్త వ్యవసాయం చేస్తుండగా.. ఆ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన స్వప్నను.. మహిళగా ఈ ఉద్యోగం ఎలా చేయగలరని పలువురు ప్రశ్నించారు. ఆమె సమాధానమిస్తూ.. ‘నా భర్త మల్లికార్జునరెడ్డి సహకారంతోనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేశా. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. స్వచ్ఛమైన మనసుండాలే కానీ.. ఏ ఉద్యోగమైతే ఏంటి. నాకు ఈ ఉద్యోగమొస్తే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. మద్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తా’ అని చెప్పింది.
                       
అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు సూపర్‌వైజర్స్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేల్స్‌మెన్‌ ఉద్యోగ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించినట్టు జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయశేఖర్‌ తెలిపారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఎక్సైజ్‌ అధికారులు సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. జిల్లాలో 198 సూపర్‌వైజర్‌ పోస్టులకు 5019 మంది, 495 సేల్స్‌మెన్‌ పోస్టులకు 4208 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఇందులో వికలాంగులు సూపర్‌వైజర్‌ ఉద్యోగాలకు 165 మంది, సేల్స్‌మెన్‌ ఉద్యోగాలకు 111 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరికి 1శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. గైర్హాజరైన వారిని అనర్హులుగా ప్రకటిస్తామన్నారు.

13న ఇంటర్వ్యూలు
ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగాలకు (సూపర్‌వైజర్స్, సేల్స్‌మెన్‌) సంబంధించి ఈనెల 13న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని  జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 గంటల నుంచి కదిరి, కళ్యాణదుర్గం, అనంతపురం, పెనుకొండ, ధర్మవరం రెవెన్యూ డివిజినల్‌ అధికారి(ఆర్‌డీఓ) కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా సూపర్‌వైజర్‌ పోస్టులకు, అనంతరం సేల్స్‌మెన్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని అభ్యర్థులు సంబంధిత ఆర్‌డీఓ అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరవ్వాలని సూచించారు. ఇంటర్వ్యూ బోర్డులో ఆర్‌డీఓ చైర్మన్‌గా, కో–ఆపరేటివ్, ఎక్సైజ్‌ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిన అభ్యర్థుల సెల్‌కు సంక్షిప్తం సందేశం పంపుతామని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top